ఐసీసీయే ఫిక్సింగ్‌కు అవకాశమిచ్చింది
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆరోపణ
ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో గత ఏడాది చోటుచేసుకున్న ఫిక్సింగ్‌కు ఐసీసీ అధికారులనే బాధ్యుల్ని చేస్తోంది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఫిక్సింగ్ జరగబోతోందని ఐసీసీ అవి నీతి నిరోధక, భద్రత యూనిట్ (ఏసీఎస్‌యూ)కు ముందుగానే సమాచారం అందినా.. మ్యాచ్ నిర్వహణకు అనుమతించారని బీసీబీ ఆరోపిస్తోంది.
బీపీఎల్‌లో భాగంగా 2013 ఫిబ్రవరి 2న ఢాకా గ్లాడియేటర్స్-చిట్టగాంగ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సయినట్లు ఐసీసీ నిర్ధారించడం తెలిసిందే. దీనికి సంబంధించి పలువురు ఆటగాళ్లు నిషేధానికి కూడా గురయ్యారు. అయితే ఈ విషయంపై బీసీబీ ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపిం చింది. ఐసీసీ ఏసీఎస్‌యూ అధికారులు ఫిక్సింగ్‌ను నిరోధించే అవకాశమున్నా పట్టించుకోకుండా సాక్ష్యాలు సేకరించేందుకే పరిమితమైనట్లుగా తేలిందని ట్రిబ్యునల్ నివేదికలో పేర్కొంది.
చిట్టగాంగ్ కింగ్స్‌తో మ్యాచ్‌ను ఫిక్స్ చేయాల్సిందిగా జట్టు యజమానుల్లో ఒకరు తనను సంప్రదించినట్లు ఢాకా గ్లాడియేటర్ కోచ్ స్వయంగా ఏసీఎస్‌యూ అధికారులకు సమాచారమిచ్చాడని ట్రిబ్యునల్ వివరించింది. అయినా ఆయా జట్ల యాజమాన్యాలను ఏసీఎస్‌యూ అధికారులు అప్రమత్తం చేయకుండా మ్యాచ్‌కు అనుమతినిచ్చారని తెలిపింది. అయితే బీసీబీ ట్రిబ్యునల్ నివేదికపై ఈ దశలో ఏమీ స్పందించలేమని ఐసీసీ చెబుతుండగా, ఏసీఎస్‌యూ చైర్మన్ రొనాల్డ్ ఫ్లానగన్ మాత్రం తమ వైఫల్యం పట్ల వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు.