నిజాం పాలనపై పొగడ్తలు దారుణం
* సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
*మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య డిమాండ్
హైదరాబాద్: దుర్మార్గమైన పాలనతో ప్రజలను వేధించిన నిజాంలను సీఎం కేసీఆర్ పొగడడం ఏమాత్రం సరికాదని, ఈ విషయంలో ఆయన పునరాలోచన చేసి, నిజాంల పాలనపై పొగడ్తలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య డిమాండ్ చేశారు. అలాగే ప్రజలకు ఈ విషయంలో క్షమాపణ చెప్పాలన్నారు.
బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(టీపీఎస్కే) ఆధ్వర్యంలో‘నిజాం పాలన- ఒక పరిశీలన’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ నిజాం పాలన దొరలకు తోడ్పాటునందించిందని, ఎంతో మంది స్త్రీలపై అత్యాచారాలు జరిగాయన్నారు. తెలంగాణ సాయుధపోరాటంలో ఎంతో మంది రైతులను పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంత దుర్మార్గమైన పాలనను కొనసాగించిన నిజాంను సీఎం కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తడం అవమానకరమన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూని యన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ మాట్లాడుతూ నిజాం పాలనలో కొన్ని భవనాలు, స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించినంత మాత్రాన, ఆయన చేసిన పాపం ఊరికే పోదని విమర్శించారు. నిజాం మంచివాడ ని సర్టిఫికెట్ ఇవ్వ టం దుర్మార్గమన్నారు.
సీఎం కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ అత్యంత దుర్మార్గంగా ప్రజ లను హింసించిన నిజాంను పొగడటం సిగ్గు చేటు అని విమర్శించారు. టీపీఎస్కే కన్వీనర్ జి.రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్, ఎస్వికె ట్రస్టీ ఎస్.వినయ్ కుమార్, ప్రొఫెసర్ భంగ్య భూక్యా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగయ్య, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, రఘుపాల్, మోత్కూరి నరహరి పాల్గొన్నారు.