రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు
పెంటపాడు :గూడెం-భీమవరం రోడ్డులో మంగళవారం లారీని ఢీకొనడంతో మోటార్ సైకిల్‌పై వెళుతున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామంలోని కొత్తగూడెంకు చెందిన వర్జిరాజు కుమారులు నవీన్, సన్ని ముదునూరులోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. ఆయన భార్య విదేశంలో ఉంటున్నారు.
పిల్లలను తీసుకెళ్లేందుకు రాజు తన సోదరుడు రవితో కలిసి మంగళవారం వచ్చాడు. తన అత్తమామలైన సువార్తమ్మ, అద్దంకి చినవెంకటరత్నంలతో గొడవపడి పిల్లలను బలవంతంగా మోటార్ సైకిల్ ఎక్కించుకొని కొత్తగూడెం బయలుదేరారు. గ్రామం నుంచి ఒక ఫర్లాంగు వచ్చేసరికి ముదునూరు శివారు వద్ద ఉన్న ఒక మిల్లులోకి లారీ వెళుతోంది. ఆ లారీని మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న రవికి తీవ్ర గాయాలయ్యాయి.
రాజు కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. నవీన్, సన్ని తలకు, కాళ్లకు, వెన్నెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. గూడెం, తణుకు నుంచి వచ్చిన అంబులెన్సులు క్షతగాత్రులను తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ రవిని అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు ముదునూరు గ్రామంలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నారు. పెంటపాడు ఎస్సై గుర్రయ్య ఆధ్వర్యంలో ఏఎస్సై నాగేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.