‘ఫుల్ మీల్స్’కు మనీ నిల్
15 నుంచి ఐసీడీఎస్‘ఒక్కపూట భోజనం’
{పారంభించాలని ఉన్నతాధికారుల ఆదేశాలు
ఎమ్మెల్యేలతో {పారంభానికి ఏర్పాట్లు
ఇప్పటి వరకు అంద ని నిధులు
ఆందోళనలో అంగన్వాడీలు
రెండు నెలలుగా అందని వేతనాలు
హన్మకొండ అర్బన్ : ప్రభుత్వం మహిళా శిశు, సంక్షేమం కోసం ప్రారంభిస్తున్న వన్డే ఫుల్ మీల్స్ పథ కం అంగన్వాడీ వర్కర్లను ఆందోళనకు గురిచేస్తోంది. పథకం అమలుకు ప్రభుత్వం నుంచి తమకు నయా పైసా అందలేదని, సరుకులు కూడా కేంద్రాలకు చేరలేదని ఇలాంటి పరిస్థితు ల్లో పథకం ప్రారంభించేది ఎలా అంటూ అంగన్వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు అంగన్వాడీ వర్కర్లకు అక్టోబర్, నవంబర్ నెలల వేతనాలే ఇంతవరకు ఇవ్వలేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు కొత్త పథకం ప్రారంభానికి సరుకులు కొనుగోలు చేయడం సాధ్యం కాదని అధికారులకు స్పష్టం చేస్తున్నారు. అన్ని కేంద్రాల్లో సరుకులు సరఫరా చేశాక కార్యక్రమం ప్రారంభిస్తే కొంతలో కొంత ఇబ్బంది తగ్గుతుందంటున్నారు.
15 నుంచి ప్రారంభానికి ఏర్పాట్లు..
కేయూలో ఇటీవల జరిగిన సమావేశంలో ఒక్క పూట భోజనం పథకంపై అధికారులు చర్చించారు. జిల్లాలో ఈ నెల 15న పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా శనివారం ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని సెక్టార్లవారీగా సమావేశాలు నిర్వహించారు.
సెక్టార్కు కొన్ని కేంద్రాలు ఎంపిక చేసుకుని స్థానిక ఎమ్మెల్యేలతో ప్రారంభానికి సమయం కూడా తీసుకున్నారు. తప్పని పరిస్థితి ఉంటే 15న కార్యక్రమం ప్రారంభించి తర్వాత జనవరి ఒకటి నుంచి పూర్తి స్థారుులో అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రారంభ కార్యక్రమమైనా బియ్యం, కోడిగుడ్లు, పాలు, పప్పు దినుసులు, వంటలకు, ఏర్పాట్లకు కలిపి ఎంత లేదన్నా కనీసం రూ.3 వేల వరకు ఖర్చవుతుంది. ఇప్పటికే జీతాలు రాక ఇబ్బందిపడుతున్న అంగన్వాడీలకు ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఇబ్బందికరంగా మారనుంది.
ఇబ్బందులున్నా కార్యక్రమం నిర్వహించాలి
ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి కొన్ని ఇబ్బందులున్నా అమలు చేయాల్సిందే. ఇదే విషయం శనివారం నిర్వహించిన సమావేశంలో ఆదేశాలిచ్చాం. 15న ప్రారంభానికి కొన్ని కేంద్రాలు ఎంపిక చేసుకున్నాం. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని వాటి కోసం స్థానిక ఎమ్మెల్యే సమయం కోరాం. లబ్ధిదారులకు కేంద్రాల్లో అన్నం పెట్టాలి. మెనూ ప్రకారం ఆహారం ఇవ్వాలి. జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు తీసుకుంటున్నాం.
- సుమితాదేవి,
హన్మకొండ రూరల్ సూపర్వైజర్