ప్రియురాలిపై అనుమానం.. ఎలుకల మందు తాగించాడు!
సాక్షి, కర్ణాటక: తాలూకా తొండేబావి హోబళీ కమలాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ (21)ప్రియురాలిపై అనుమానం పెంచుకుని ఆమె అంతమొందించాలని ఎలుకల మందు తాగించాడు. ఇతడు ఒక మైనరు బాలికను ప్రేమించాడు. ఈ నెల 6వ తేదీన తొండేబావి సమీపానికి పిలుచుకొని పోయి నీ ప్రేమ పరిశుద్దమైనదైతే ఈ ద్రావణాన్ని తాగాలని బలవంతం చేశాడు. బాలిక అలాగేనని తాగడంతో కొంతసేపటికి ఇద్దరూ ఎవరి ఇళ్లకు వారు వచ్చారు.
ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి
బాలిక ఇంటికి వచ్చి కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండడంతో ఆమె అన్న బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించాడు. మందు ప్రభావంతో బాలిక ఇటీవల మరణించింది. దీంతో ప్రియుడు వెంకటేశ్ తనను పోలీసులు పట్టుకుపోతారని భావించి తన నోటికి ఎలుకల మందును పూసుకొని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు నటించాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు వెంకటేశ్ ఏమీ తాగలేదని చెప్పడంతో పోలీసులు విచారించి బాలికకు మందు తాగించింది ఇతడేనని నిర్ధారించి కేసు నమోదు చేశారు. మంచేనహళ్ళి పోలీసులు వెంకటేశ్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.
చదవండి: మోడల్స్‌ను పంపుతా.. ఆ ఖర్చులను మీరే భరించాలి..!