Giriraj
-
మరో ప్రయోగం
గత ఏడాది ‘అంధాథూన్’, ‘బదాయి హో’ వంటి ప్రయోగాత్మకమైన సినిమాలు చేసి బాలీవుడ్లో క్రేజీ హీరోగా మారారు ఆయుష్మాన్ ఖురానా. తాజాగా స్వలింగ సంపర్కం అంశంతో కూడిన సినిమాలో హీరోగా నటించడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాతో హితేష్ కేవల్యాస్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నీనా గుప్తా, గిరి రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 13న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది ‘ఆర్టికల్ 15’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయుష్మాన్ ‘డ్రీమ్‌గాళ్, బాల, గులాబో సీతాబో’ వంటి చిత్రాల్లో నటించారు. ‘బాల’ నవంబర్‌లో, ‘గులాబో’.. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్నాయి. -
ఐదేళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి
ఖాదీ ద్వారా కల్పిస్తాం: కేంద్ర మంత్రి గిరిరాజ్ ముంబై: ఖాదీ పరిశ్రమ ద్వారా రానున్న ఐదేళ్లలో ఐదు కోట్ల మందికి ఉపాధి కల్పించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి గిరిరాజ్‌సింగ్ తెలిపారు. ‘‘ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్(కేవీఐసీ)లో సోలార్ ఆధారిత స్పిన్నింగ్ వీల్స్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికను రూపొందించాం. ఇది దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మందికి ఐదేళ్ల కాలంలో ఉపాధి కల్పించగలదు’’ అని మంత్రి వివరించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమలో ఖాదీ ఉత్పత్తుల వాటా ఒక శాతంలోపే ఉందన్నారు. గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కృషితో ఖాదీ విక్రయాలు 2014లో రూ.35,000 కోట్లుగా ఉండగా... ప్రస్తుతం రూ.52,000 కోట్లకు పెరిగినట్టు వివరించారు. వడ్డీ రేట్లలో రాయితీలు, ఆర్థిక సాయం, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలు తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు గిరిరాజ్ చెప్పారు. ఖాదీ ఉత్పత్తుల వినియోగానికి ప్రాచుర్యం కల్పించేందుకు గాను అరవింద్, రేమండ్ తదితర కంపెనీలతో కేవీఐసీ భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. -
ఆ వ్యాఖ్యలపై స్పందన అనవసరం: సోనియా
మధ్యప్రదేశ్: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎట్టకేలకు నోరు విప్పారు. సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తుల వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు. మధ్యప్రదేశ్‌లో పంట నష్టపోయిన రైతులను కలిసిన అనంతరం విలేకరులతో గురువారం ఆమె మాట్లాడారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా న్యూఢిల్లీ, బెంగళూరులో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మంత్రి ఇంటి ముందు ధర్నాచేపట్టి, ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గిరిరాజ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. కేంద్రమంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ముందు నోరుజారి క్షమాపణ చెబితే సరిపోదని, మంత్రి పదవి నుంచి ఆయన తొలగించాలని కర్ణాటక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంజులా నాయుడు డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యల పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాహుల్ గాంధీని లేదా సోనియా గాంధీని బాధపెట్టి ఉంటే చింతిస్తున్నానని గిరిరాజ్ ప్రకటించారు. మరోవైపు ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, మాట్లాడేటప్పుడు ఆలోచించాలని.. పరిపాలన, అభివృద్ధి పైనే దృష్టి సారించాలని ఆయనకు సూచించింది. తెల్లతోలు వల్లే సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారని, రాజీవ్ గాంధీ కనుక నైజీరియన్‌ను పెళ్లి చేసుకొని ఉంటే, ఆమెకు తెల్ల తోలు ఉండకపోయేదని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెను నాయకురాలిగా అంగీకరించేదా అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.