ఆ వ్యాఖ్యలపై స్పందన అనవసరం: సోనియా
మధ్యప్రదేశ్: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎట్టకేలకు నోరు విప్పారు. సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తుల వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు. మధ్యప్రదేశ్లో పంట నష్టపోయిన రైతులను కలిసిన అనంతరం విలేకరులతో గురువారం ఆమె మాట్లాడారు.
మరోవైపు మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా న్యూఢిల్లీ, బెంగళూరులో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మంత్రి ఇంటి ముందు ధర్నాచేపట్టి, ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గిరిరాజ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. కేంద్రమంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ముందు నోరుజారి క్షమాపణ చెబితే సరిపోదని, మంత్రి పదవి నుంచి ఆయన తొలగించాలని కర్ణాటక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంజులా నాయుడు డిమాండ్ చేశారు.
తన వ్యాఖ్యల పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాహుల్ గాంధీని లేదా సోనియా గాంధీని బాధపెట్టి ఉంటే చింతిస్తున్నానని గిరిరాజ్ ప్రకటించారు. మరోవైపు ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, మాట్లాడేటప్పుడు ఆలోచించాలని.. పరిపాలన, అభివృద్ధి పైనే దృష్టి సారించాలని ఆయనకు సూచించింది.
తెల్లతోలు వల్లే సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారని, రాజీవ్ గాంధీ కనుక నైజీరియన్‌ను పెళ్లి చేసుకొని ఉంటే, ఆమెకు తెల్ల తోలు ఉండకపోయేదని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెను నాయకురాలిగా అంగీకరించేదా అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.