టీడీపీ కౌన్సిలరా.. మజాకా!
- గాడి తప్పుతున్న ఎన్టీఆర్ సుజల స్రవంతి
- ప్రభుత్వ బోరుతో, పాఠశాల వంట గదిలో ఏర్పాటు
- చోద్యం చూస్తున్న మున్సిపల్, విద్యాశాఖాధికారులు
మైదుకూరు(చాపాడు) : ప్రజలకు స్వచ్ఛమైన, శుద్ధినీటిని అందించేందుకు ప్రభుత్వం అమలు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం లక్ష్యం నీరుగారుతోంది. మహాత్మాగాంధీ జయంతి రోజును పురస్కరించుకుని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించింది. ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తల చేత డొనేట్ చేయించి ప్రజలకు 20 లీటర్ల శుద్ధినీటిని కేవలం రూ.2లకే ఇవ్వాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. దీన్ని తెలుగు తమ్ముళ్లు అవకాశంగా వినియోగించుకుంటూ సంపాదించుకుంటున్నారు.
మైదుకూరు పట్టణ పరిధిలోని మూలబాటలో స్వయం సహాయక సంఘం పేరుతో వాటర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. టీడీపీకి చెందిన 14వ వార్డు కౌన్సిలర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వంట గదిలో ఎలాంటి అనుమతుల్లేకుండా ఏర్పాటు చే శారు. 550 కుటుంబాలు ఉన్న మూలబాట ఏరియాకు మంచినీటినందించే బోరును ఈ ప్లాంటుకు ఉపయోగిస్తున్నారు. పది నెలలుగా ఈ తతంగం జరుగుతున్నా అటు విద్యాశాఖాధికారులు గానీ, ఇటు మున్సిపల్ అధికారులు గానీ చ ర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు.
కాసులు పోగేసుకుంటున్న కౌన్సిలర్: ప్లాంటు వద్దకొచ్చిన వారికి మాత్రమే రూ.2లకు శుద్ధినీటిని ఇస్తున్నారు. ఆటోలలో పట్టణమంతా నీటిని సరఫరా చేస్తూ రూ.6 నుంచి 10 వరకు రూ.20 లీటర్ల శుద్ధినీటిని అమ్ముకుంటున్నాడు. రోజుకు ఆటోల్లో 180 క్యాన్ల నీటిని తరలించి అమ్ముకుంటుండగా, ప్లాంటు వద్ద రోజూ 300 క్యాన్లను ప్రజలు తీసుకెళ్తున్నారు. అదనంగా శుభకార్యాలకు విక్రయిస్తున్నారు. ఈ లెక్కన నెలకు ఆటోలలో సరఫరా చేసే నీటిని రూ.32-54 వేల వరకు, ప్లాంటు వద్ద రూ.15-18 వేల వరకు, వివాహాది శుభకార్యాలు, ట్యాంకర్ల ద్వారా రూ.4500 నుంచి రూ.6000 వరకు రాబడి వస్తోంది. మొత్తం మీద నెలకు రూ.52-78 వేల వర కు సంపాదిస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రభు త్వ బోరును, ప్రభుత్వ గదిని ఉపయోగిం చుకుంటున్న ఆయా శాఖలకు ఏ ఒక్క రూ పాయి కూడా చెల్లించపోవటం గమనార్హం.
కమిషనర్, ఎంఈఓలు ఏమన్నారంటే..
ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, ఎంఈఓ పుల్లయ్యను వివరణ కోరగా.. ప్లాంటు ఆరంభంలో వాటిని ఎలా ఉపయోగించుకున్నారో తెలియదని తెలిపారు. వాటిపై విచారణ జరిపి, వాటర్ సరఫరా ఏఈ, మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీ నిర్వాహకురాలితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు.