వడగళ్ల బీభత్సం
దమ్మన్నపేట్, గోవింద్‌పల్లి(ధర్పల్లి), న్యూస్‌లైన్: ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్ గ్రామ పరిధిలోని మరియా, బేల్యాతండాల్లో, గోవింద్‌పల్లి గ్రామ పరిధిలోని గుడితండాల్లో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వడగళ్ల వానకు వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు వడ్లు పూర్తిగా రాలిపోయాయి. తొంభై శాతం వరకు వడ్లు నేల రాలాయి. ఆదివారం ఉదయమే రైతులు పంట పొలాలకు వెళ్లి చూడగా నేల రాలిన వడ్లను చూసి గుండెలు బాదుకున్నారు.
సుమారు ఏడు వందల ఎకరాల్లో వరి పంట పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించారు. వడ్లు రాలిపోయి గడ్డి మాత్రమే మిగలడంతో రైతులు లబోదిబోమమంటూ రోదించారు. గిరిజన రైతులను ఆదుకోవాలని కోరారు. పంట నష్టంతో తిందామంటే లేకుండా పోయిందని మహిళ రైతులు రాలిన వరిగడ్డితో రోదిస్తూ నేలను బా దుకున్నారు. భారీ ఈదురు గాలులకు మామిడికాయ లు పూర్తి స్థాయిలో నేలరాలాయి. కోత దశకు వచ్చిన మామిడి పంట దెబ్బతినటంతో రైతులు బోరున విలపించారు. టమాట, నువ్వు, మిర్చిపంటలూ దెబ్బ తిన్నాయి.
అలాగే దుబ్బాక, మైలారం, చల్లగరిగె, రామడుగు, కేశారం, ఎల్లారెడ్డిపల్లి, లోలం గ్రామాల్లో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి వరిపైరు నేల కొరిగింది. మామిడికాయలు నేల రాలాయి. మరియా, బేల్యా, గుడితండాల్లోని దెబ్బతిన్న పంటలను ఏఈఓ న ర్సయ్య, వీఆర్వోలు పోశెట్టి, సాయిలు, ప్రభాకర్ ప రిశీలించి పంట నష్టాన్ని అంచనా వేశారు. పంట నష్ట పరిహారం ఇవ్వాలని మాజీ ఎంపీపీ గడ్డం సుమనరెడ్డి డిమాండ్ చేశారు. పంటలను ఆమె పరిశీలించారు.