సమాజం తిరగబడే పరిస్థితి తెచ్చుకోకండి
ఖమ్మం: ప్రభుత్వోపాధ్యాయుల తీరుపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. సమాజం తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని వారిని హెచ్చరించారు. అటువంటి దుస్థితి ఉపాధ్యాయులకు రాకూడదన్నారు. గతంలో ఉపాధ్యాయుడు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండేవాడని, కానీ ఇప్పుడు ప్రజలే ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించి పాఠశాలలకు పంపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలోని పువ్వాడ ఆడిటోరియంలో జరిగిన ఉపాధ్యాయుల మోటివేషన్ కార్యక్రమానికి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
హెచ్ఎం అంకితభావంతో పని చేస్తేనే.
పాఠశాల హెడ్మాస్టర్ (హెచ్ఎం) అంకితభావంతో పనిచేస్తే ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, ఉత్తమ ఫలితాలు కూడా సాధించవచ్చని కడియం పేర్కొన్నారు. అంకితభావం కొరవడిన చోటే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకన్నా అన్ని అర్హతలు కలిగిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఎందుకు కుంటుపడుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఉపాధ్యాయ సంఘాలు 50కి పైగా ఉన్నాయని, ఆయా సంఘాల నాయకులు చేతిలో డైరీలు పట్టుకుని డీఈవో కార్యాలయాల చుట్టూ తిరగడం శోచనీయమన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతోపాటు విద్యా వ్యవస్థలోని మార్పులకు ఉపాధ్యాయ సంఘాలు సూచనలివ్వాలని, ఇందుకోసం సెమినార్లు నిర్వహించాలని కడియం సూచించారు.
సమయమంతా ప్రయాణాల్లోనే...
ఉపాధ్యాయుల సమయమంతా బస్సులు, రైళ్లలోనే (స్కూళ్లకు రాకపోకల కోసం ప్రయాణాల్లోనే) గడిచిపోతోందన్నారు. మహిళా ఉపాధ్యాయులైతే ఇంట్లో పనిచేసుకొని హడావుడిగా పాఠశాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితిలో వెళ్లిన ఉపాధ్యాయులు ఏం బోధిస్తారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉండాలని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధ్యాయులకంటే విద్యార్థులు తెలివైన వారిగా ఉంటున్నారన్నారు.
సన్నాహం కాకుండా తరగతికి వెళ్లే ఉపాధ్యాయుడు బోధించడం కష్టమన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోందని, మౌలిక వసతుల కల్పనకు ఎన్ని కోట్లు అయినా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిధులు విడుదల చేసే పూచీ ప్రభుత్వానిదని, సక్రమంగా పాఠాలు చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్ తదితరులు పాల్గొన్నారు.
అవమానించడం తగదు: ఉపాధ్యాయ సంఘాలు
ఉపాధ్యాయులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం కడియం చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి ఉపాధ్యాయులను బహిరంగ వేదికపై అవమానించేలా మాట్లాడటం కడియం శ్రీహరికి తగదని ఖమ్మం జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి.
ఉపాధ్యాయ సంఘాలు డైరీలు పట్టుకుని తిరుగుతున్నాయని పేర్కొనడంతోపాటు ఉపాధ్యాయినులను కూడా కించపరిచేలా మంత్రి మాట్లాడటం శోచనీయమన్నాయి. ఏకీకృత సర్వీసుల రూపకల్పనలో కాలయాపన చేయడమే కాకుండా ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం...దాన్ని కప్పిపుచ్చుకుని ఉపాధ్యాయులను విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాయి. ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించాయని, ఈ విషయాన్ని మరిచిన మంత్రి ఇష్టారీతిన మాట్లాడి అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఖమ్మంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీఎఫ్, టీఎన్యూఎస్, టీపీటీఎఫ్ సంఘాల నాయకులు మాట్లాడారు.