'గౌతమి'కి బోగీ మిస్.....
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నుంచి కాకినాడ మధ్య నడిచే గౌతమి ఎక్స్‌ప్రెస్‌కు ఓ బోగీ మిస్ అవుటం గందరగోళాన్ని సృష్టించింది. కాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బుధవారం ఎక్స్‌ప్రెస్ రైళ్ళన్నీ గంటన్నర నుంచి రెండు గంటలు ఆలస్యంగా నడవటంతో ప్రయాణికులు పడిగాపులు కాశారు. నిన్న సాయంత్రం బయల్దేరాల్సిన రైళ్లన్ని ఆలస్యంగా బయల్దేరాయి. రాత్రి 9.15కి బయల్దేరాల్సిన గౌతమి ఎక్స్‌ప్రెస్ గంట ఆలస్యంగా ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చింది. తీరా చూస్తే రైలుకు ఎస్ 11 బోగీ లేదు. తామెక్కడ కూర్చోవాలని 11వ బోగీలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు అధికారుల్ని నిలదీశారు.
అప్పటికప్పుడు హడావుడిగా మరో బోగీని జత చేశారు. చివర్లో అదనపు బోగీని జత చేసిన అధికారులు తిరిగి ఎస్ 1 నుంచి 11 వరకు అన్ని బోగీల నెంబర్లను మార్చారు. దీంతో గందరగోళం నెలకొంది. ప్రయాణికులు లగేజీలతో యాతనపడుతూ అటూ ఇటూ మారారు. కాగా, నాందేడ్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ పనిచేయకపోవటంతో ప్రయాణికులు గొడవకు దిగారు. ఈ ఘటనలతో స్టేషన్లో కలకలం రేగింది.