హంస, శేష వాహనాలపై నరసన్న
సఖినేటిపల్లి(రాజోలు) :
అంతర్వేది శ్రీలక్ష్మీ నృసింహస్వామివారు హంస, శేష వాహనాలపై శనివారం గ్రామంలో ఊరేగారు. స్వామివారి కల్యాణోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో అర్చకులు వాస్తుపూజ, అంకురార్పణ, విష్ణుదీక్షాధారణ చేపట్టారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగడానికి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామి వారిని సాయంత్రం హంస వాహనంపై ఉంచి గ్రామంలో ఊరేగించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురు చూశారు. రాత్రి శేష వాహనంపై ఉంచి స్వామి వారి గ్రామోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ధూపసేవ, ధ్వజారోహణం కార్యక్రమాలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.