గ్రీన్హౌస్ కంపెనీల బ్యాంక్ డిపాజిట్ సొమ్ము తగ్గింపు
రూ. 50 లక్షల నుంచి రూ. 25 లక్షలకు కుదిస్తూ ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్హౌస్ (పాలీహౌస్) ప్రాజెక్టు మందకొడిగా సాగుతోన్న నేపథ్యంలో పలు నిబంధనలను సడలిస్తూ పోతున్న సర్కారు.. తాజాగా మరికొన్ని ప్రతిపాదనలు తయారు చేసింది. గ్రీన్హౌస్ ప్రాజెక్టును విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా మరికొన్ని సవరణలు చేయాలని ఉద్యానశాఖ సాంకేతిక కమిటీ నిర్ణయించింది. గ్రీన్హౌస్ నిర్మాణం చేపట్టే కంపెనీలు ఉత్సాహంగా ముందుకు రావాలంటే కఠినంగా ఉన్న నిబంధనలను సడలించాలని నిర్ణయించింది.
దీనిలో భాగంగా గ్రీన్హౌస్ కంపెనీలు చెల్లించాల్సిన బ్యాంక్ డిపాజిట్ సొమ్మును రూ. 50 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు త గ్గించాలని ప్రతిపాదించింది. రైతులకు ఒక ఎకరా వరకు గ్రీన్హౌస్ నిర్మాణం చేసే కంపెనీలు రూ. 25 లక్షల వరకు బ్యాంక్ డిపాజిట్ సొమ్ము చూపిస్తే చాలని ప్రతిపాదించారు. ఒక ఎకరాకు మించి మూడెకరాల వరకు గ్రీన్హౌస్ చేపట్టగల సామర్థ్యం గల కంపెనీలు రూ. 35 లక్షల వరకు బ్యాంక్ డిపాజిట్ కలిగి ఉండాలని నిర్ణయించారు. ఇదిలావుండగా నిర్దేశించిన భూమిలో గ్రీన్హౌస్ నిర్మాణం చేపట్టాలంటే ముందుగా సంబంధిత పరికరాలు చేరాక రైతు చెల్లించే 25 శాతం సొమ్మును మాత్రమే ఇస్తున్నారు.
ఆ తర్వాత పని చాలా వరకు జరిగాకనే మరో 25 శాతం అడ్వాన్సుగా ఇస్తున్నారు. దీన్ని సవరించి 35 శాతం వరకు ఇచ్చేలా చేయాలని ప్రతిపాదనలు తయారు చేశారు. కఠిన నిబంధనల కారణంగా 5 కంపెనీలే ముందుకు వచ్చాయన్న చర్చ అధికారుల్లో నెలకొంది. దీనివల్ల అటు కంపెనీలు... ఇటు రైతులు నిరాశగా ఉన్నారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి సడలింపులు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.