handri neeva sujala sravanthi
-
రాయలసీమలో నవశకం
సాక్షి, కర్నూలు : రాయలసీమ.. ఈ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్షన్ రాజకీయాలు, కరువుతో అల్లాడే జిల్లాలే. అయితే ఇదంతా గతం... 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ నుంచి సీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతితో ఆగిపోయిన రాయలసీమ అభివృద్ధిని ముఖ్యమంత్రి జెట్ స్పీడుతో పరుగులు పెట్టించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్ సంక్పలంతో ప్రస్తుతం అంతరాష్ట్ర వివాదాలను అధిగమిస్తూ, సాంకేతిక సమస్యలను దాటుకుంటూ ప్రాజెక్ట్ పనులకు టెండర్లు పిలిచే దశకు చకచకా చేరుకుంది. ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల పథకమే పెద్దది.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు అతిపెద్దదిగా భావించే హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం. దీని మొత్తం పంపింగ్ సామర్థ్యం ఏడాదికి 40 టిఎంసీలు మాత్రమే. అలాగే పట్టిసీమ, ముచ్చుమర్రి, కొండవీటి వాగు, పురుషోత్తపట్నంలాంటి ఎత్తిపోతల పథకాలు గతంలోనే పూర్తయ్యాయి. వీటితో ఏమాత్రం పోలికలేని విధంగా సీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్.. కర్నూలు జిల్లా సంగమేశ్వర వద్ద నిర్మిస్తున్నారు. ఇంత వరకు ఏ ప్రభుత్వానికి, ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఆయనకు వచ్చిందే తడవుగా సాంకేతిక, ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించి పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే రాయలసీమలో అత్యధిక ప్రాంతాలకు తాగు, సాగునీరు అందనుంది. శతాబ్దాలుగా కరువు ప్రాంతంగా పిలువబడుతున్న ఈ ప్రాంతం ఇక కృష్ణమ్మ పరవళ్లతో పచ్చదనంతో కళకళలాడనుంది. వృథా నీటిని ఒడిసి పట్టనున్న ఎత్తిపోతల పథకం.. ఎన్నో దశాబ్దాలుగా సీమ తాగు, సాగు నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించాలని డిమాండ్ ఉన్నప్పటికి కార్యరూపం దాల్చలేదు. గత 16ఏళ్ళలో పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీటి వినియోగాన్ని పరిశీలిస్తే 2018-19, 2019-20 సంవత్సరాల్లో మినహాయిస్తే మిగిలిన అన్ని సంవత్సరాల్లో లభించాల్సిన నీటికన్నా తక్కువ నీరు అందింది. ఆఖరికి కృష్ణాకు భారీ వరదలు వచ్చి శ్రీశైలం పొంగి ప్రవహించి జలాలు సముద్రంపాలు అయ్యాయే తప్ప సీమ వాసులకు మాత్రం ప్రయోజనం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ వరద నీటిని మళ్లించుకోవడమే ఏకైక శరణ్యమని ముఖ్యమంత్రి తలంచారు. దీంతో ఇంజనీరింగ్ నిపుణులు అధ్యయనంచేసి ఆచరణలో సాధ్యమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భారీ పంపింగ్ కేంద్రం.. రాయలసీమ ఎత్తిపోతల పథకం(ఆర్.ఎల్.సీ-రాయలసీమ లిప్ట్ స్కీమ్) ద్వారా రోజు మూడు టీఎంసీల(34722 క్యూసెక్కులు) నీటిని వరదల సమయంలో కృష్ణా నది నుంచి రాయలసీమకు మళ్లిస్తారు. ఉపనది తుంగభద్ర వచ్చి కృష్ణాలో కలిసే సంగమేశ్వరం ప్రాంతం వద్ద ఈ పథకాన్ని చేపడతారు. ఇక్కడ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పంపింగ్ కేంద్రాన్ని నిర్మిస్తారు. జలాశయంలో 800నుంచి 850 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా అవసరాలకు నీటిని మళ్లించేలా పంప్ చేసి పోతిరెడ్డిపాడు సమీపంలోని 4కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ఆర్ఎంసీలోకి విడుదల చేస్తారు. కృష్ణా నదికి గరిష్టంగా వరదలు ఉన్నపుడు రోజుకు 8టీఎంసీల వరకు కూడా పంప్ చేసేలా నిర్మించి సీమ అవసరాలు తీర్చాలనేది వైఎస్ జగన్ సర్కార్ ఉద్దేశం. భారీ పైపులైన్లను ఏర్పాటుతో నీటి తరలింపు.. ఎత్తిపోతల ద్వారా పంప్ చేసిన నీటిని 125మీటర్ల పొడవున ఏర్పాటు చేసే పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తారు. ఆ తరువాత డెలివరీ సిస్ర్టన్ నుంచి నీరు విడుదలై 22 కిలోమీటర్ల మేర ప్రవహించి పోతిరెడ్డిపాడుకు సమీపంలో 4-5కిలోమీటర్ల మద్య ఎస్ఆర్ఎంసీలో కలుస్తుంది. అక్కడి నుంచి నీరు తెలుగు గంగ, ఎస్.ఆర్.బీ.సీ, కేసీ కాలువలకు సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లో పంప్ హౌస్ తోపాటు సంగమేశ్వర నుంచి ముచ్చుమర్రి వరకు 4.5కిలోమీటర్ల కాలువ శ్రీశైలం వెనుక జలాల భాగంలో తవ్వుతారు. పంప్ హౌస్ లో 12మిషన్లు ఏర్పాటు అవుతాయి. ఒక్కొక్కటి 81.93 క్యుమెక్కుల సామర్థ్యంతో 39.60 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసేలా 33.04 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్ లు, మోటార్లు ఏర్పాటు అవుతాయి. 397మెగావాట్ల విద్యుత్ వినియోగం అవసరం.. రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని తరలించేందుకు మొత్తం 397మెగావాట్ల విద్యుత్ వినియోగం అవసరమవుతుంది. ఇంత పెద్దస్థాయిలో విద్యుత్ ను వినియోగించి ఒక కేంద్రం నుంచి నీటిని పంపింగ్ చేయడం రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఏపీలో ఇదే అరుదైనది, పెద్దది అవుతుంది. ఈ పంప్ హౌస్ పనిచేయాలంటే కనీస నీటిమట్టం 243 అడుగులు ఉండాలి. డెలివరీ లెవల్ 273 అడుగుల వద్ద ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ముఖ్యంగా కొత్తకాలువ తవ్వడానికి 12వేల ఎకరాల భూమిని సేకరించాలని అంచనా వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాయలసీమ రూపురేఖలు మార్చేలా అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. -
ప్రగతికి అడవి అడ్డంకి
జిల్లా ప్రగతికి అడవి అడ్డంకిగా మారింది. సాగునీటి ప్రాజెక్టులేగాక అభివృద్ధి కార్యక్రమాలకూఅడవి అడ్డొస్తోంది. అటవీ శాఖ అనుమతులు సకాలంలో రాకపోవడంతో సాగునీటి ప్రాజెక్టులపనులు నిలిచిపోయాయి. కృష్ణమ్మ గలగలలతో బంగారు పంటలు పండాల్సిన భూములుబంజరుగా మిగిలిపోతున్నాయి. స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్ పనులను అటవీశాఖఅధికారులు ఇటీవల అడ్డుకోవడమే అందుకు నిదర్శనం. సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా భౌగోళిక విస్తీర్ణం 37.03 లక్షల ఎకరాలు. ఇందులో 11.15 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. 18.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. సాగుకు యోగ్యమైన భూమిలో అరణియార్, కాళంగి వంటి చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 50 వేల ఎకరాలకు, చెరువుల ద్వారా 1.57 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే ఏ ఒక్క ఏడాది కూడా ఆ మేరకు నీళ్లందించిన దాఖలాలు లేవు. పోనీ ఆ మేరకు నీళ్లందుతాయని లెక్క లు వేసుకున్నా రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉన్నట్లు స్పష్టమవుతోంది. సెంట్రల్ ఇరిగేషన్ కమిషన్ నివేదిక ప్రకారం ఒక జిల్లా విస్తీర్ణంలో కనీసం 30 శాతం భూమికి నీటిపారుదల సౌకర్యం ఉండాలి. 30 శాతం అటవీ ప్రాంతం ఉండాలి. ఆ నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణం జిల్లాలో 30.02 శాతం ఉంది. నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి ఐదు శాతం మాత్రమే ఉన్నట్లు స్పష్టమవుతోంది. నీటిపారుదల సదుపాయాన్ని కల్పించడానికి దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి,గాలేరు-నగరి సుజల స్రవంతి, స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్, తెలుగు గంగ ప్రాజెక్టులను చేపట్టారు. గాలేరు-నగరి ద్వారా 1,03,500 ఎకరాలు, హంద్రీ-నీవా ద్వారా 1.40 లక్షల ఎకరాలు, సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ 87,734 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమేగాక 23,266 ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీళ్లందించాలని నిర్ణయించారు. పర్యావరణ, అటవీ అనుమతులను తెప్పించిన వైఎస్ ఆ ప్రాజెక్టులను చేపట్టారు. వైఎస్ హఠాన్మరణం తర్వాత ఆ ప్రాజెక్టులకు అటవీ శాఖ గ్రహణం పట్టుకుంది. ఇంత జాప్యమేల * రూ.300 కోట్లతో చేపట్టిన స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్ పనులు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. కారణం అటవీ శాఖ అనుమతుల్లో జాప్యమే. శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలోని 190 కంపార్ట్మెంట్లో 640 ఎకరాల అటవీ భూమి స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్ తవ్వకానికి అవసరమవుతుంది. ఆ మేరకు అటవీ శాఖకు మరో చోట భూమి చూపించి, పరిహారం అందిస్తే సరిపోతుంది. ఆ మేరకు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. * తెలుగుగంగ ప్రాజెక్టుకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నికర జలాలను కేటాయించింది. ఈ ప్రాజెక్టు వల్ల బీఎన్ కండ్రిగ, శ్రీకాళహస్తి, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో 49 వేల ఎకరాలకు నీళ్లందించాలి. పదివేల ఎకరాలకు కూడా నీళ్లందిస్తున్న దాఖలాలు లేవు. ఇందుకు ప్రధాన కారణం అటవీ శాఖ అనుమతలు రాకపోవడమే. తెలుగుగంగ ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీలు తవ్వేందుకు 145 ఎకరాల అటవీ భూమి అవసరమవుతుంది. ఆ మేరకు అటవీ శాఖకు మరో ప్రాంతంలో భూమిని చూపించి, రూ.63.40 కోట్లను పరిహారంగా చెల్లిస్తే సరిపోతుంది. అదీ ఆచరణకు నోచుకోలేదు. * జిల్లాలో గాలేరు-నగరి, హంద్రీ-నీవాలదీ అదే పరిస్థితి. అటవీశాఖ అనుమతుల్లో జాప్యంతోపాటూ ప్రభుత్వం సక్రమంగా నిధులు కేటాయించకపోవడంతో ఆ ప్రాజెక్టుల పనులు పూర్తిగా పడకేశాయి. గోపాలన్నపైనే ఆశలు తిరుపతి సమీపంలో ఎస్వీ జూపార్కు వద్ద రూ.వంద కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మించేందుకు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. ఇందుకు 30.3 ఎకరాల అటవీ శాఖ భూమిని కేటాయించారు. ఆ ప్రాంతంలో స్టేడియం నిర్మాణానికి అటవీ శాఖ అనుమతించలేదు. కారణం ప్రభుత్వం మరో ప్రాంతంలో భూమిని చూపించకపోవడం, పరిహారాన్ని చెల్లించకపోవడమే. ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా జిల్లాకే చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. అటవీ శాఖ అనుమతులకు, అవసరమైన నిధుల కేటాయింపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే వెనుకబడిన జిల్లా ప్రగతిపథంలో దూసుకెళుతుంది.