ఆ జైలుపై దాడి పోలీసులకు ముందే తెలుసు
పాటియాలా: దేశంలో సంచలనం సృష్టించిన నభా జైలు దాడి గురించి పోలీసులకు ముందే తెలుసా? తెలిసి కూడా ఎందుకు అప్రమత్తమవ్వలేదు? కేవలం అనుమానాలతోనే సరిపెట్టి పరిణామాన్ని చవిచూశారా? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా పోలీసులే.. అది కూడా ఈ ఘటన జరగడానికి ముందే కొత్వాలి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్లో రాశారు.
గత ఏడాది(2016) నభా జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ గురుప్రీత్ సెఖాన్, మరో నలుగురు సహచరులను తప్పించడంతోపాటు ఖలిస్తాన్ టెర్రరిస్టు హర్మీందర్ మింటూను బయటకు తీసుకొచ్చే ఉద్దేశంతో కొంతమంది ముఠా జైలుపై నేరుగా దాడి చేసిన విషయం తెలిసిందే. జైలు గేటు వద్ద సెంట్రీని బెదిరించి మరీ జైలు లోపలికి వెళ్లి కాల్పులు జరిపి వారితో పరారయ్యారు. ఈ ఘటన పంజాబ్‌లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మింటూను ఇతరులను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.
విచారణలో భాగంగా పలు రికార్డులు పరిశీలించగా.. జూన్ 3, 2016లో రాసిన ఓ ఎఫ్ఐఆర్లో పెద్దమొత్తంలో సెక్యూరిటీ ఉండే జైలుపై గ్యాంగ్స్టర్లు దాడి చేసే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు. అంతేకాదు, హర్మీందర్ సింగ్ రోమీ, తన సహచరులను విడిపించేందుకు కుట్ర జరగొచ్చని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పోలీసు ఉన్నత కార్యాలయాలకు, మేజిస్ట్రేట్‌కు కూడా పంపించారు. అయినప్పటికీ ఎలాంటి జాగ్రత్త లేకుండా ఉండటంపట్ల ఉన్నతాధికారులకు జైలు భద్రతా సిబ్బందిపై పలు అనుమానాలకు తావిస్తోంది.