తప్పుకోవాలనే నిర్ణయం నాదే: లోర్గాట్
జొహన్నెస్‌బర్గ్: బీసీసీఐతో ఏర్పరుచుకునే సంబంధాల్లో పాలుపంచుకోకూడదని తానే నిర్ణయించుకున్నట్టు దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) సీఈవో హరూన్ లోర్గాట్ స్పష్టం చేశారు. ఇరు జట్ల మధ్య జరుగబోయే సిరీస్‌కు ఎలాంటి ఆటంకం ఉండరాదనేదే తన ఉద్దేశమని అన్నారు. లోర్గాట్తో విభేదాలున్న కారణంగా భారత క్రికెట్ బోర్డు సఫారీ పర్యటనపై మొదట్లో అనాసక్తి ప్రదర్శించిన సంగతి విదితమే. దీంతో రంగంలోకి దిగిన సీఏ అధ్యక్షుడు.. లోర్గాట్‌ను పక్కన పెడతామని హామీ ఇచ్చారు.
‘భారత పర్యటన ఖరారు అయ్యేంతవరకు, అలాగే నాపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయే వరకు పక్కకు తప్పుకుంటానని నేనే బోర్డుకు విజ్ఞప్తి చేశాను. ఈ నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నాను. పర్యటన కన్నా ఎవరూ ముఖ్యం కాదు’ అని లోర్గాట్ తెలిపారు.