మిషెల్ ఒబామా.. బురఖా వివాదం!
సౌదీ అరేబియా పర్యటనలో మిషెల్ ఒబామా బురఖా ధరించకపోవడం అక్కడ పెద్ద వివాదానికి కారణమైంది. భారతదేశ పర్యటన ముగించుకుని సౌదీ అరేబియా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్.. తన దుస్తుల తీరును కొంతవరకు మార్చుకున్నారు. ఇక్కడ కాస్త పొట్టి గౌన్లలో కనిపించిన ఆమె, అక్కడ పొడవాటి ప్యాంట్లు కూడా ధరించారు. అయినా కూడా బురఖా లేదన్న కారణంతో ఆమె ముఖాన్ని సౌదీ అధికారిక చానల్లో బ్లర్ చేసి చూపించారని పెద్ద వివాదం రేగింది. అయితే, ఆ ఆరోపణలు అవాస్తవమని, వాస్తవాలు చూడాలి తప్ప ఫేస్బుక్ వివాదాల మీద ఆధారపడొద్దని సౌదీ ఎంబసీ ట్వీట్ చేసింది.
వాస్తవానికి యూట్యూబ్లో పోస్ట్ చేసిన క్లిప్పింగులలో అయితే సౌదీ అరేబియా టీవీ మిషెల్ ముఖాన్ని బ్లర్ చేసి చూపించినట్లు ఉంది. అయితే, ప్రత్యక్ష ప్రసారం చూసినవాళ్లు మాత్రం అదేమీ లేదని చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఇదంతా పెద్ద వివాదంగా మారింది. గల్ఫ్ దేశాల్లో మహిళల దుస్తుల మీద సాధారణంగా కఠినమైన నిబంధనలుంటాయి. మహిళలు తప్పనిసరిగా బురఖా వేసుకోవాలి, ముఖం కూడా కప్పుకోవాలి. అయితే విదేశీయులకు మాత్రం ఈ నిబంధన ఉండదు.