ట్రెయిలర్‌తోనే పడేశారు!
సినిమా చూడ్డానికి ముందు ట్రెయిలర్లు విడుదల చేస్తారు... సినిమా మీద ఆసక్తిని పుట్టించడానికి. అదే పద్ధతిని టీవీవాళ్లూ అనుసరిస్తుంటారు. అయితే అసలు కథ తీయడం కంటే ఈ ట్రెయిలర్లు తీయడమే కష్టం. తక్కువ సమయంలోనే కట్టి పారేయాలి. ఇందులో ఏదో ఉంది అనిపించాలి. హిందీవాళ్లు ఈ విషయం మీద పెద్ద కసరత్తే చేస్తుంటారు. వేరే సీరియళ్లు వచ్చే సమయంలో కొత్తగా మొదలవుతున్న సీరియల్ గురించి చెప్పిస్తారు. సీరియల్లోని పాత్రలు కొత్త సీరియల్ గురించి సందర్భానుసారంగా మాట్లాడుకుంటాయి. ఆ తర్వాత ట్రెయిలర్ వేస్తారు. ఆ ట్రెయిలర్స్ కూడా వినూత్నంగా ఉంటాయి.
అయితే మన తెలుగులో ఒకప్పుడు ట్రెయిలర్ల మీద పెద్ద దృష్టి పెట్టలేదు. సీరియల్స్‌లోని సీన్లే వేసేసేవారు. కానీ ఇప్పుడు మనవాళ్లు కూడా ట్రెండు మార్చారు. అందుకు ఉదాహరణ... ‘ఆకాశమంత‘ సీరియల్. ఇటీవలే జెమినీ చానెల్లో మొదలైన ఈ సీరియల్ ట్రెయిలర్‌తోనే కట్టిపడేసింది. పిల్లల పెంపకం గురించి విరుద్ధమైన భావాలు కల ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ‘ఆకాశమంత’. వాళ్లిద్దరూ తమ అభిప్రాయాలను తమ స్టయిల్లో వెల్లడించడం, పైగా వాళ్లు మంజుల, మేధ లాంటి పాపులర్ నటీమణులు కావడం ఆసక్తిని కలిగించింది. సీరియల్ కోసం ఎదురు చూసేలా చేసింది. మల్టీప్లెక్సులు ప్రేక్షకులకు ఎర వేసి లాగేస్తున్న ఈ సమయంలో... వారిని టీవీలకు కట్టేయడానికి ఆ మాత్రం క్రియేటివిటీని ప్రదర్శించాలి మరి!