మహిళతో చెప్పు దెబ్బలు తిన్నాడు
బెంగళూరు(కర్ణాటక): చుట్టూ జనం ఉన్నారనే భయం లేకుండా ఓ వ్యక్తి మహిళతో అసభ్యంగా ప్రవర్తించి చివరకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన బుధవారం జాలహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం జాలహళ్లి క్రాస్ సిగ్నల్ వద్ద ఓ మహిళ రోడ్డు దాటడానికి ఎదురు చూస్తుండగా అదే సమయంలో అక్కడే ఉన్న టీ.దాసరహళ్లికి చెందిన నారాయణప్ప ఆమెను పదే పదే తాకుతూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీంతో ఓపిక నశించిన మహిళ నారాయణప్పను చేతితో కొట్టింది.
దీంతో షాక్కు గురైన అతడు ఏదో పొరపాటున చేయి తగిలిందంటూ తిరిగి మహిళను బెదిరించడానికి ప్రయత్నించాడు. ఆమె నారాయణప్పను చెప్పుతో కొట్టడం ప్రారంభించడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ భైరేగౌడ మద్దతుగా నిలిచారు. విషయం తెలుసుకున్న పింక్ హొయ్సళ వాహనం అక్కడికి చేరుకొని మహిళను, నారాయణప్పను స్టేషన్ తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నారాయణప్పను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ భైరేగౌడను డీసీపీ శోభారాణి అభినందించి నగదు బహుమానాన్ని అందించారు.