బస్తానిండా బాంబులు.. పేలి 63 మంది మృతి
బౌచీ(నైజీరియా): భారీ సంఖ్యలో నాటు బాంబులు ఉన్న గోనెసంచి పేలిపోయి 63 మంది మృత్యువాత పడ్డారు. ఒకప్పుడు బొకోహారమ్ ఉగ్రవాదులు నివాసం ఉన్న క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అతిపెద్ద బాంబు దాడులను మించిన స్థాయిలో ఓ దాడిలాగా ఇది జరిగింది. అత్యంత భారీ శబ్దంతో ఈ పేలుడు సంభవించింది. అధికారుల సమాచారం మేరకు ఈశాన్య నైజీరియాలోని మోంగునో పట్టణానికి సమీపంలో బొకో హారమ్ ఉగ్రవాదులు గతంలో ఉన్న స్థావరం వద్ద కొన్ని వస్తువులతో నిండిన సంచిని గుర్తించారు. వీరంతా కూడా ఆత్మరక్షణ దళ పౌరులు.
ఆ సంచిని తీసుకొని వెళ్లి అంతా ఒకచోట గుమి కూడా ఆ వస్తువులు ఏమై ఉంటాయా అని చూస్తుండగా ఒక్కసారిగా భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. భారీ శబ్దంతో అన్ని బాంబులు పేలిపోయాయి. దీంతో మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. 63 మంది మృత్యువాత పడ్డారు. పలువురు అంగవైకల్యానికి గురయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.