రూ. 1,200 లోపు ఆస్తిపన్ను రద్దు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల ఆస్తిపన్ను రూ. 1,200 లోపు ఉన్న 5,09,187 ఇళ్ల యజమానులకు శుభవార్త. వారంతా ఇకనుంచి తాము జీహెచ్ఎంసీకి ఏటేటా చెల్లిస్తున్న ఆస్తిపన్నును చెల్లించాల్సిన పనిలేదు. ఈ మేరకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. ఇళ్లను అద్దెకివ్వకుండా యజమానులే ఉంటున్న నివాసగృహాలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అయితే వీరంతా నామమాత్రంగా ప్రతియేటా రూ. 101 ఆస్తిపన్నుగా చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ ఖజానాకు రావాల్సిన ఆదాయం తగ్గనుంది.
ఆస్తిపన్ను జాబితాలోని 5,09,187 ఇళ్ల నుంచి ఈ ఆర్థికసంవత్సరానికి రావాల్సిన ఆస్తిపన్ను రూ.29.40 కోట్లు కాగా, పాతబకాయిలు మరో రూ. 57.99 కోట్లు, వెరసి మొత్తం రూ. 87.39 కోట్ల జీహెచ్ఎంసీ ఆదాయం తగ్గనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సంపన్న కాలనీల్లో మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లోని డబుల్బెడ్రూమ్ ఇళ్ల వారి వరకు ప్రయోజనం కలగనుంది.
త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే వివిధ సంక్షేమ, అబివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉండటం తెలిసిందే. అందులో భాగంగా ఇదివరకే తీసుకున్న ఆస్తిపన్ను మినహాయింపు నిర్ణయంపై తాజాగా జీవో జారీ చేశారు. జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులు దాదాపు 14.50 లక్షలుండగా, వారిలో 5.09 లక్షల మందికి ఈ సదుపాయం వర్తించనుంది.