హెచ్ఎండీఏను ముట్టడించి ఉద్యమిస్తామం..
హిమాయత్‌నగర్: యువతకు ప్రాధాన్యతను ఇస్తామని ముఖ్యమంత్రి చెబుతుంటే మరో పక్క అధికారులు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ‘ఇంటర్నేషనల్ హంప్టీ–డంప్టీ’ ఫుడ్ ఫెస్టివల్ నిర్వాహకులు ఆరోపించారు.అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించతలపెట్టిన ఫుడ్‌ఫెస్టివల్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎండీఏ తమకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని నిర్వాహకులు తుల్లూరి పృథ్వితేజ్, గుణశేఖర్రెడ్డి, జయదీప్‌రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. సోషల్ నెట్వర్క్ ద్వారా యువతకు సమాచారాన్ని చేరవేసి హెచ్ఎండీఏను ముట్టడించి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
వీరికి మద్దతుగా నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్ విలేకరులతోమాట్లాడారు. భారతదేశ వంటలను రుచి చూపించేందుకు ఫుడ్‌ఫెస్టివల్ నిర్వహిద్దామనుకుంటే సహకారం అందించాల్సిన హెచ్ఎండీఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. తక్షణం వీరికి న్యాయపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు వెనకాడమని హెచ్చరించారు. నిర్వాహకులు ప్రిత్వితేజ్, శ్రీదివ్య, గుణశేఖర్లు మాట్లాడుతూ హెచ్ఎండీఏ తీరువల్ల తాము తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. రూ.60లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.