మత సామరస్యం పెంపొందించాలి
సాక్షి, బెంగళూరు: దేశంలోని ప్రజల మధ్య మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని వివిధ మతాలకు చెందిన మత పెద్దలు సూచించారు. ప్రజల్లో మత సామరస్యం, ఐక్యతను పెంపొందించేందుకు నగరంలో ఆదివారం నిర్వహించిన ‘హుస్సేన్ డే’ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నగరవాసులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న పూరి పీఠాధిపతి స్వామి అధోక్షానంద్జీ మహారాజ్ శంకరాచార్య మాట్లాడుతూ... ప్రజల మధ్య ఐక్యతా భావాన్ని పెంచాల్సిన బాధ్యత మత గురువులపై ఎక్కువగా ఉందని తెలిపారు. ఏ మతాన్ని ఆచరించినా తాము భారతీయులమన్న మాటను ఎవ్వరూ మరువరాదని సూచించారు. అనంతరం మజ్లిస్-ఇ-ఉలేమా-ఇ-హింద్ ప్రధాన కార్యదర్శి మౌలానా సయ్యద్ కాల్బే జావాద్ మాట్లాడుతూ... ప్రపంచంలోని ఏ దేశంలోనూ కనిపించని స్వేచ్ఛా స్వాతంత్య్రాలను భారతదేశం తన ప్రజలకు కల్పించిందని చెప్పారు.
ఎవరికైనా సరే తనకు న చ్చిన మతాన్ని అనుసరించే హక్కు ఉందని అన్నారు. తన మాటల ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ ఎదుటివారికి హాని తలపెట్టని వాడే నిజమైన ముస్లిం అని ఇస్లాం బోధిస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ముస్లిం నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హ్యారిస్‌తో పాటు ఇతర మతాలకు చెందిన మత గురువులు పాల్గొన్నారు.