పెనుగాలి బీభత్సం
- ఆలూరు నియోజకవర్గంలో గాలివాన
- ఆస్పరి ప్రాంతంలో అల్లకల్లోలం
- కూలిపోయిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
- ఎగిరిపోయిన గుడిసెల పైకప్పులు
- చీకట్లో మగ్గిపోయిన గ్రామాలు
ఆస్పరి: మండల పరిధిలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. గుడిసెల పైకప్పులు ఎగిరిపోవడంతో ఆయా గ్రామాల వారు తీవ్ర అవస్థలు పడ్డారు. భయంకరమైన ఉరుములు, మెరుపులకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎక్కడికక్కడ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అందకారం నెలకొంది. అధికారిక లెక్కల ప్రకారం ఆస్పరిలో 6 , నగరూరులో 12, బనవనూరులో 17 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా ట్రాన్స్‌కోకు రూ. 70 వేల నష్టం వాటిల్లింది. నగరూరు, బనవనూరుకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆయా గ్రామాల వారు అందకారంలో మగ్గిపోయారు.
బనవరూరులో సుంకన్న, మచ్చన్న గారి సుంకన్న, ఖాజా, మరో 10 మంది గుడిసెలు, వారపాకులకు వేసిన రేకులు గాలికి ఎగిరిపోయాయి. బనవనూరులో లక్ష్మన్న బోరు కింద ఎకరన్నరలో సాగు చేసిన వరి పైరు గాలి కారణంగా నేలవాలింది. చేతికొచ్చే దశలో పంట ఇలా నేలపాలవడంతో లక్ష్మన్న అవేదన చెందుతున్నారు. ఆయా గ్రామాల్లో చాలా చెట్లు నెలకొరిగాయి. ఆదివారం కూడా పెనుగాలు కొనసాగాయి. ఉరుములు, మెరుపులు విపరీతంగా ఉండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా సాహసించలేకపోయారు. కూలిపోయిన విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ఏఈ సురేష్ బాబు చెప్పారు. బనవనూరుకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, నగరూరు పరిధిలో స్తంభాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.