హైదరాబాద్ x ఆంధ్ర
లక్నో: రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’లో నాకౌట్ పోరు రసకందాయంలో పడింది. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించడంతో పాటు వచ్చే ఏడాది పై గ్రూప్‌లోకి ప్రమోట్ అవుతాయి. ఇప్పుడు ఈ స్థానాలను నిర్ణయించే కీలక మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు హైదరాబాద్, ఆంధ్ర తలపడబోతున్నాయి. లక్నోలో జరిగే ఈ మ్యాచ్ లీగ్ దశలో ఇరు జట్లకూ ఆఖరిది. బద్రీనాథ్ సారథ్యం లోని హైదరాబాద్ ప్రస్తుతం 30 పాయింట్లతో నాకౌట్‌కు బాగా చేరువలో ఉంది. చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడిస్తే హనుమ విహారి నాయకత్వంలో ఆడుతోన్న ఆంధ్ర (ప్రస్తుతం 25 పాయింట్లు) జట్టుకూ ఆ అవకాశం ఉంటుంది. అయితే వీరికి పోటీగా 25 పాయింట్లతో ఉన్న హరియాణా, తమ చివరి మ్యాచ్‌లో త్రిపురలాంటి బలహీన జట్టుతో ఆడుతుండటం ఆ జట్టుకు సానుకూలాంశం. హైదరాబాద్‌ను ఆంధ్ర ఓడించి, మరోవైపు హరియాణా గెలవకుండా ఉంటే... హైదరాబాద్, ఆంధ్ర కలిసి ముందుకు దూసుకెళతాయి.
పాయింట్లు చెరి సగం...
మరోవైపు న్యూఢిల్లీలో కాలుష్యం కారణంగా వారుుదా పడిన రెండు లీగ్ మ్యాచ్‌లను మళ్లీ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంపై బీసీసీఐ వెనకడుగు వేసింది. ఇలా చేస్తే లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడటం వల్ల వారికి అనుచిత లబ్ది చేకూరుతుందని ముంబై, తమిళనాడు జట్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో ఆ రెండు మ్యాచ్‌లను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. బెంగాల్, గుజరాత్ మధ్య... హైదరాబాద్, త్రిపుర మధ్య జరగాల్సిన నాటి మ్యాచ్‌ల నిర్వహణ తీవ్ర కాలుష్యంతో సాధ్యపడలేదు.