ఆ మ్యాచ్ పై కొనసాగుతున్న సస్పెన్స్
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. చర్చోపచర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. భరోసా ప్రకటనలు వెలువడుతున్నాయి. తమ జట్టు భద్రతకు భారత ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వాలని పాకిస్థాన్ పట్టుబడుతుండగా, లిఖిత పూర్వక హామీ ఇచ్చేది లేదని ఇండియా అంటోంది. ఈ నేపథ్యంలో చర్చలు కొనసాగుతున్నాయి.
పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత బాసిత్ విలేకరులతో మాట్లాడుతూ... తమ జట్టు భద్రతకు హోంశాఖ కార్యదర్శి హామీయిచ్చారని చెప్పారు. ఇదే విషయాన్ని తమదేశ ప్రభుత్వానికి తెలియజేస్తానని అన్నారు. ఇంతకుమించి వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
కాగా, తమ దేశానికి ఎవరు వచ్చినా భద్రత కల్పిస్తామని అంతకుముందు హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత్-పాక్ మ్యాచ్ ధర్మశాల నుంచి కోల్ కతాకు తరలిస్తామని బీసీసీఐ తనను అడగ్గా భద్రత కల్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతాలో వెల్లడించారు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 19న ధర్మశాలలో భారత్-పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ను భద్రత కారణాలతో కోల్కతాకు మార్చిన సంగతి తెలిసిందే.