'మెగా ఎస్బీఐ' తర్వాతే బ్యాంక్‌ల ఏకీకరణ
* ఆర్థికంగా మెరుగుపడితేనే విలీనాలు
* వచ్చే మార్చికల్లా ఎస్బీఐ విలీన ప్రక్రియ పూర్తి
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో అనుబంధ, భారతీయ మహిళ బ్యాంక్‌ల విలీనం పూర్తయిన తర్వాతనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏకీకరణ జరిగే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. బ్యాంక్‌ల ఆర్థిక స్థితిగతులు చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడితేనే విలీనాలు, కొనుగోళ్ల దిశగా యోచించనున్నట్లు ఆయన చెప్పారు.
ఎస్బీఐలో అనుబంధ బ్యాంక్ విలీనం పూర్తయిన తర్వాతే తర్వాతి రౌండ్ బ్యాంక్‌ల విలీనం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మొండి బకాయిల భారంతో కుదేలై ఉన్న బ్యాంక్‌లు ఆర్థికంగా పటిష్టమైతేనే ఇతర బ్యాంక్‌లను విలీనం చేసుకోగలవని వివరించారు. వచ్చే ఏడాది మార్చికల్లా బ్యాంక్‌ల బ్యాలెన్స్ షీట్ ప్రక్షాళన పూర్తవుతుందన్న అంచనాలున్నాయని, ఆ తర్వాతనే బ్యాంక్‌ల పనితీరు మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఎస్బీఐలో బ్యాంక్‌ల విలీనం పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఐదు అనుబంధ బ్యాంక్‌లతోపాటు భారతీయ మహిళ బ్యాంక్, ఎస్బీఐలో విలీనం కావడానికి గత వారమే కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది.