Innovation Lab
-
ఆవిష్కరణలే లక్ష్యంగా స్కూళ్లలో ప్రత్యామ్నాయ బోధన
సాక్షి, హైదరాబాద్: పాఠశాల స్థాయిలో నిరంతరం మారుతున్న బోధన పద్ధతులతో పాఠ్యాంశాల్లో విద్యార్థులను విలీనం చేయడం ద్వారా సృజనాత్మకతకు మరింత పదును పెట్టే అవకాశం ఏర్పడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కొత్త విద్యా విధానానికి అనుగుణంగా కామారెడ్డి జిల్లాలో నవమ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. నవమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడిచే ఇన్నోవేషన్ ల్యాబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఐఎల్‌సీఈ) ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సె ల్ (టీఎస్ఐసీ)తో మంగళవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరిన సందర్భంగా జయేశ్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని జయేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎల్‌సీఈ ఏర్పాటు కోసం టీఎస్ఐసీ, నవమ్ ఫౌండేషన్ భాగస్వామ్యం రాష్ట్రంలో ఆవిష్కరణల సంస్కృతి, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు బాటలు వేస్తుందని టీఎస్ఐసీ సీనియర్ సలహాదారు వివేక్ వర్మ తెలిపారు. ప్రవాహ, టీఎస్ఐసీ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే ప్రాజెక్టు లో తాము భాగస్వాములు కావడం పట్ల అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్పర్సన్ రామ్‌జీ రాఘవ న్ హర్షం వ్యక్తం చేశారు. సృజనాత్మక, ఆవిష్కరణల వాతావరణంలో క్షేత్రస్థాయి నుంచి అందరినీ భాగస్వాములను చేస్తూ తెలంగాణ సాధించే ఫలితాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రవాహ ఫౌండేషన్ చైర్మన్ రవి కైలాస్ చెప్పారు. 15 ఎకరాల్లో ఐఎల్‌సీఈ ఏర్పాటు.. రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారా ఆవిష్కరణల వాతావరణాన్ని ప్రోత్సహించే దిశగా టీఎస్ఐసీ ముందడుగు వేసింది. కామారెడ్డి జిల్లాలో 15 ఎకరాల్లో ఏర్పాటయ్యే ‘నవమ్ ప్రాంగణం’లో ఇన్నోవేషన్ ల్యాబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ప్రవాహ ఫౌండేషన్ సంయుక్తంగా వచ్చే పదేళ్లలో రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాయి. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని 11 నుంచి 18 ఏళ్ల వయసు లోపు విద్యార్థులు, 19 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం ఐఎల్‌సీఈ ద్వారా అందుతుంది. ఈ క్యాంపస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మినీ సైన్స్ సెంటర్లు, డోర్ టు డోర్ సైన్స్ ల్యాబ్‌లు, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి వనరులను అందుబాటులోకి తెస్తుంది. క్షేత్రస్థాయిలో ఎంట్రప్రెన్యూర్లుగా మారాలనుకునే యువతకు ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లను కూడా అందజేస్తుంది. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. -
ఒప్పో తొలి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో ఇండియాలో తన తొలి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తోంది. చైనా తరువాత , భారతదేశంలోని హైదరాబాద్‌లో తమ తొలి 5జీ ల్యాబ్ అని కంపెనీ ప్రకటించింది. అంతేకాదు నూతన ఆవిష్కరణలతోపాటు, భారతదేశాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేలక్ష్యంలో భాగంగా మరో మూడు ఫంక్షనల్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. స్మార్ట్‌ఫోన్స్ రంగంలో భారత్‌లో 5జీ మోడళ్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఒప్పో ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో తమ రీసెర్చ్, డెవలప్మెంట్ కేంద్రంలో 5జీ ఇన్నేవేషన్ ల్యాబ్‌ను ఆవిష్కరించనున్నామనీ, విదేశాల్లో ఇది మొదటిదని ఒప్పో తెలిపింది. అలాగే అత్యాధునిక ఆవిష్కరణ పనుల కోసం కెమెరా, పవర్, బ్యాటరీ పనితీరు మెరుగుపర్చేలా మరో మూడు ఫంక్షనల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తద్వారా 5 జీ యుగానికి కోర్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి, మొత్తం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపింది. ముఖ్యంగా ఇండియా 5జీ ప్రయాణంలో మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తస్లీమ్ ఆరిఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
హైదరాబాద్‌లో క్వాల్కామ్ ఇన్నోవేషన్ ల్యాబ్
టీ–హబ్‌తో చేతులు కలిపిన కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం క్వాల్కామ్... హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది. సంస్థకు ఇప్పటికే బెంగళూరులో ఇలాంటి ల్యాబ్ ఒకటుంది. హైదరాబాద్‌లో ఉన్న కంపెనీ కార్యాలయంలో ఏప్రిల్‌లో ఈ ల్యాబ్‌ను నెలకొల్పుతున్నట్టు క్వాల్కామ్ ఇండియా ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ శశి రెడ్డి బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. స్టార్టప్‌లు తమ వ్యాపార ప్రణాళికను తదుపరి దశకు తీసుకెళ్లేందుకు ఈ ల్యాబ్ దోహదం చేస్తుందన్నారు. స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన ఉత్పాదనకు అనుగుణంగా చిప్‌ల డిజైన్ చేపడతామని వెల్లడించారు. కాగా, కంపెనీ ఎంపిక చేసిన స్టార్టప్‌లకే ల్యాబ్స్ అందుబాటులో ఉంటాయి. క్వాల్కామ్ డిజైన్ ఇన్ ఇండియా (క్యూడీఐపీ) కార్యక్రమం కింద దేశంలో కంపెనీ సుమారు రూ.60 కోట్లు వ్యయం చేస్తోంది. స్టార్టప్‌లకు ఫండింగ్.. క్వాల్కామ్ డిజైన్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా టీ–హబ్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, టీ–హబ్ ఫౌండర్ శ్రీనివాస్ కొల్లిపర, సీఈవో జయ్ కృష్ణన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. టీ–హబ్‌లో ఒక ల్యాబ్‌ను సైతం క్వాల్కామ్ ఏర్పాటు చేసింది. ఫైనాన్షియల్ టెక్నాలజీస్, స్మార్ట్ సిటీస్ లక్ష్యంగా పనిచేస్తున్న స్టార్టప్‌లు ఈ ల్యాబ్‌ను వినియోగించుకోవచ్చు. టీ–హబ్ మెంటార్‌గా వ్యవహరిస్తుంది. ఇక క్యూడీఐపీలో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 14 స్టార్టప్‌లను ఎంపిక చేసి ఒక్కొక్కదానికి రూ.6.80 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తారు. ఫైనల్స్‌కు చేరిన నాలుగు కంపెనీలకు ఒక్కోదానికి రూ.68 లక్షలు ఇస్తామని శశి రెడ్డి తెలిపారు.