Inter-crop
-
అంతర్ పంటతో ‘అసలు’కు దెబ్బ
బాల్కొండ: పసుపు పంటలో మొక్కజొన్న పంటను అంతర్ పంటగా సాగు చేస్తారు. కేవలం పసుపు పంటకు మర్రిఆకు తెగులు సోకకుండ కాపాడుకోవడానికి మొక్కజొన్నను పలుచగా సాగు చేయాలని ఉద్యాన అధికారులు సూచిస్తారు. కానీ కొందరు రైతులు రెండు పంటలలో అధిక దిగుబడి సాధించాలన్న ఆశతో పసుపు పంటలో మొక్కజొన్నను అధికంగా సాగుచేస్తుంటారు. దీంతో పసుపు పంట పూర్తిగా దెబ్బతింటుంది. బాల్కొండ మండలంలోని చాలా గ్రామాల్లో ఇలాగే పసుపు పంట దెబ్బతింది. పసుపు మధ్యలో వేసిన మొక్కజొన్న కోసిన తరువాత పసుపు పూర్తిగా తెలుపు రంగులో మారి ఎండినట్లు అయింది. ఇలా పసుపు పంట దెబ్బతినే అవకాశం ఉందని హర్టికల్చర్ అధికారులు అంటున్నారు. మొక్కజొన్న ఎక్కువగా ఉండటం వలన సరైన గాలి, సూర్యరశ్మి లభించక పసుపు పంట ఆకులపై మచ్చలు ఏర్పాడుతాయని వారు పేర్కొంటున్నారు. పసుపుపంట ఆకుపై హరితాన్ని మొత్తం చీడలు వ్యాపించి తినేస్తాయి. దీంతో పసుపు పంట వేళ్లు వదులుగా మారి ఎండుతాయి. పసుపులో అంతర్ పంటగా మొక్కజొన్నను తక్కువ మోతాదులో సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నివారణ చర్యలు అంతరపంటగా మొక్కజొన్నను అధికంగా సాగు చే య డం వల్ల పసుపు పంట పత్ర హరితం కోల్పోయి.. ఎండిపోతుంది. ఇలా జరిగినప్పుడు.. పొటాష్ హెక్టార్కు 60 కిలోలు వెదజల్లాలి. కాపర్ ఆక్సైడ్ 3 గ్రా ములు లీటర్ నీటిలో, 19 :19: 10 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారి చేయాలి. లేదా ఎకరానికి 10 లీటర్ల వేపనూనెను పిచికారి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. -
మక్కను కోశాక..పసుపులో సస్యరక్షణ
పసుపులో అంతర పంటగా వేసిన మొక్కజొన్నను కోయగానే కలుపు తీయాలి. పసుపులో ఉండే కలుపుతో పాటు మొక్కజొన్న ఆకులను, కొయ్యలను తీసేయాలి. 20 రోజులకొకసారి చొప్పున మూడుసార్లు కలుపు తీయాలి. కలుపు తీసిన ప్రతిసారి పొటాష్ వెదజల్లాలి. కలుపు తీసిన తర్వాత పంటకు తడి అందించాలి. తేమ ఉన్నప్పుడు ఒక హెక్టార్ పసుపు పంటకు 60 కేజీల పొటాష్ వెదజల్లాలి. లేదా లీటర్ నీటికి కార్బండైజమ్ 1.5 మి.లీటరు, కాపర్ ఆక్సైడ్ 3 గ్రాములు, 19:19 10 గ్రాములు కలిపి 400 లీటర్ల మందును పిచికారి చేయాలి. పసుపు ఆకుపై మచ్చలు ఉంటే మర్రి ఆకు తెగులు సోకిందని గుర్తించి 400 లీటర్ల నీటికి 200 మిల్లీ లీటర్ల మోనో క్రొటోఫాస్, వంద గ్రాముల కాపర్ ఆక్సైడ్ కలిపి ఆకులపై పిచికారి చేయాలి. మొక్కజొన్న కోసిన తర్వాత రైతులు కాంప్లెక్స్ ఎరువు 20:20 ను పొటాష్తో కలిపి వేస్తారు. కానీ ప్రస్తుత దశలో పసుపు పంటకు కాంప్లెక్స్ ఎరువుతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల కాంప్లెక్స్ ఎరువులు వేయరాదు. పసుపు పంటకు దుంపకుళ్లు సోకితే పసుపు ముదురు ఆకులు పూర్తిగా ఎండి పోతాయి. ఆకులను తీస్తే దుర్వాసన వస్తుంది. పసుపులో నీటి నిలువ ఎక్కువగా ఉంచరాదు. నీరు తక్కువ మోతాదులోనే పంటకు అందించాలి. దుంప కుళ్లను ప్రస్తుత దశలో పూర్తిగా నివారించలేం. కేవలం వ్యాపించకుండా చర్యలు చేపట్టవచ్చు. -
అంతర పంటలతో అధిక లాభాలు
గజ్వేల్: మొక్కజొన్నలో చిక్కుడును అంతర పంటగా వేస్తూ రైతులు మంచి ఫలితాలు రాబడుతున్నారు. వర్షాలు బాగా కురిస్తే రెండు పంటల ద్వారా ఆదా యం గడిస్తున్నారు. ఒక వేళ వర్షాభావ పరిస్థితులు నెలకొంటే సమర్థవంతంగా తట్టుకునే శక్తి చిక్కుడుకు ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో చాలా మంది రైతులు మొక్కజొన్న లో అంతర పంటగా దీన్ని వేస్తున్నారు. దీనితో పాటు కంది, బబ్బెర, జొన్న, చిక్కుడు తదితర పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న జనాభాకు సరిపోయే మేర పప్పులు, కూరగాయల దిగుబడి ఉండడం లేదు. ఫలితంగా వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొక్కజొన్న పంటలో చిక్కుడును అంతర పంటగా వేస్తూ ఈ ప్రాంత రైతులు అధిక లాభాలు సాధిస్తున్నారు. చిక్కుడును వేయడం వల్ల మొక్కజొన్నకు ఎటువంటి న ష్టం కలగదు. మొక్కజొన్న ఏపుగా పెరిగేంత వరకు చిక్కుడు చిన్నదిగా ఉండడం వలన రైతులకు కలుపు తీయడంలో ఇబ్బందులు ఏర్పడవు. మొక్కజొన్న కోత పూర్తయిన తర్వాత చి క్కుడు తీగ ఏపుగా పెరుగుతుంది.. జూన్ నెలలో వేసిన మొక్కజొన్న అక్టోబర్ నెలలో కోతకు వస్తుంది. చిక్కుడు నవంబర్ నెలలో కాతకు వచ్చి ఫిబ్రవరి నెల వరకు కాత కాస్తుంది. దీర్ఘకాలంగా పంట రా వడం వలన రైతులకు ఆర్థికంగా మేలు చేకూరుతుంది. మొక్కజొన్న పంట తర్వాత ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు వేసుకోవాలి. పూత దశలో ఆకుముడత, పూత నిలవడం కోసం క్రిమిసంహారక మందులు పిచికారీ చే యాలి. కాతకు వచ్చిన తర్వాత క్రిమికీటకాలు ఆశించకుండా మందులు వా డితే సరిపోతుంది. ఒక ఎకరాలో రూ.60 వేల వరకు దిగుబడి సాధించవచ్చని రైతులు చెబుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఒక ఎకరాకు రెండు పంటలు కలిపి లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. -
గంజాయి ఘాటు
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలోని ఖానాపూర్, బజార్హత్నూర్, భూతాయి, డెడ్ర, సిర్పూర్, కడెం, చెన్నూర్, నిర్మల్, భైంసాతోపాటు ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది గంజాయిని అంతరపంటగా సాగు చేస్తున్నారు. పత్తి, తొగరి పంటలు సాగు చేసినప్పుడు మధ్యలో గంజాయి సాగు చేస్తున్నారు. చేలల్లో బంతిపూల మొక్కలు కూడా పెంచడంతో గంజాయి ఆకు కూడా అదే ఆకారం, రంగులో ఉండడంతో పెద్దగా తేడా కనిపించదు. ఎవరైనా బయట నుంచి చూస్తే ఇతర ఏవో పంటలు సాగు చేస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుంది. మధ్యలో ఉన్న గంజాయి కనిపించదు. గంజాయి ఆకు పూర్తిగా ఎండిపోతే వాసన వస్తుంది. ఎరుపు రంగులోకి మారుతుంది. ఇలా జరిగితే చేనులో గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిసిపోతుంది. దీంతో పూర్తిగా ఎండిపోకముందే ఆకు తెంపుతున్నారు. బస్సులు, రైళ్లలో ఇతర రాష్ట్రాలకు.. జిల్లాలో సాగైన గంజాయికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి గంజాయిని ఏజెంట్లు ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు బెంగళూరుకు రవాణా చేస్తున్నారు. గంజాయి సాగు చేసిన యాజమాని నుంచి జిల్లాలోని కొంతమంది మధ్యవర్తులు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఏజెంట్ల ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఏజెంట్లు గంజాయిని సంచుల్లో నింపి బస్సులు, రైళ్లలో తరలిస్తుంటారు. గంజాయి వాసన రాకుండా ఉండేందుకు సెంటు చల్లుతారు. ఎక్కడైనా పోలీసులకు పట్టుబడితే ఆ బ్యాగులు తమవేని చెప్పకుండా ఏజెంట్లు ముందే ఒప్పందం కుదుర్చుకుంటారు. జిల్లాలో కిలో గంజాయి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ధర పలుకుతోంది. డిమాండ్ ఉన్న రాష్ట్రాల్లో అక్కడి వ్యాపారులు కిలో రూ.5వేల నుంచి రూ.15వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. గంజాయి సాగు చేసిన వారితోపాటు ఏజెంట్లు, వ్యాపారులకు లాభసాటిగా మారడంతో దందా జోరుగా సాగుతోంది. 12 కేసులు నమోదు జిల్లా నుంచి గంజాయి పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు తరలుతోంది. ఈ ఏడాది జిల్లాలో రూ.15 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 12 కేసులు నమోదు చేశారు. గత ఏడాది 23 కేసుల్లో సుమారు 6 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకోగా, దీని విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండగా పట్టుబడిన కేసులే అధికంగా ఉన్నాయి. ఈ నెల 3న బజార్హత్నూర్ మండలం భూతాయి-బి గ్రామ అటవీ ప్రాంతంలో రూ.10 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్లో గతంలో ఐచర్లో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఇందులో రూ.1.30 కోట్ల విలువైన గంజాయి లభించింది. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి సాగు చేస్తూ.. ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నా పోలీసులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుబడిన గంజాయిపై కేసులు నమోదు చేయడమే గానీ.. ఎక్కడ సాగువుతుంది, ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరు తరలిస్తున్నారు, ఈ వ్యాపారం వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ చేసిన దాఖలాలు లేవు. దీంతో గంజాయి సాగు, వ్యాపారం జోరుగా సాగుతుందనే ఆరోపణలున్నాయి. పట్టణాల్లోకి ప్యాకెట్లు.. జిల్లాలో గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాల నుంచి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఖానాపూర్ పట్టణాలకు ప్యాకెట్ల రూపంలో సరఫరా అవుతున్నట్లు సమాచారం. ప్యాకెట్లను కాలనీల్లోని దుకాణాలు, కొంతమంది ఇళ్లలో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ప్యాకెటు రూ.50 నుంచి రూ.100కు విక్రయిస్తున్నారు. వీటితోపాటు రూ.20కి కాగితాల్లో పొట్లం కట్టి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. యువత, మధ్య వయస్కులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సిగరేట్లోని పొగాకును తీసి వేసి గంజాయితో నింపి తాగుతున్నారు. మత్తులో మునిగి తేలుతున్నారు.