వరదలు.. ఆకలి.. వలసలు.. !
వాతావరణ మార్పు వల్ల ఈ శతాబ్దంలో పెనుముప్పు
ప్రపంచదేశాలకు ఐరాస నిపుణుల కమిటీ హెచ్చరిక
యొకొహామా (జపాన్): వాతావరణ మార్పు కారణంగా ప్రపంచవ్యాప్తంగా వరదలు, కరువు ముప్పు ఈ శతాబ్దంలో మరింత తీవ్రం కానున్నాయని, ఫలితంగా ఆకలి, వలసలు పెరిగి సామాజిక సంఘర్షణలు సైతం అధికం కానున్నాయని ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ హెచ్చరించింది. కార్బన్ ఉద్గారాలు పెరిగి వాతావరణ మార్పు వల్ల కలిగే ప్రభావాలపై అధ్యయనం చేసిన ఐరాస ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ)’ ఈ మేరకు సోమవారం కీలకమైన తన రెండో నివేదికను విడుదల చేసింది.
కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోకపోతే గనక.. ప్రపంచవ్యాప్తంగా ఆస్తులకు, పర్యావరణ వ్యవస్థలకు లక్షల కోట్ల డాలర్ల నష్టం తప్పదని కమిటీ హెచ్చరించింది. ఉష్ణోగ్రత ఒక్కో డిగ్రీ పెరిగినకొద్దీ పరిస్థితి తీవ్రం అవుతుందని, తర్వాత కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు అయ్యే ఖర్చు కూడా గణనీయంగా పెరుగుతుందని తెలిపింది.