మార్కెట్లు అతలాకుతలం
అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళన
► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాల్లో ఐఎంఎఫ్ కోత
► కొనసాగుతున్న ముడి చమురు ధరల పతనం
► కరెన్సీ క్రాష్.. బంగారం వైపు పరుగులు
► సెన్సెక్స్ 418 పాయింట్లు డౌన్.. 24,062 వద్ద క్లోజ్
► 126 పాయింట్ల నష్టంతో 7,309కు నిఫ్టీ
అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళన కారణంగా ప్రపంచ మార్కెట్లు బుధవారం అతలాకుతలమయ్యాయి. స్టాక్ మార్కెట్లు. ముడి చమురు ధర నిలువునా పతనం కాగా, బంగారం భగ్గుమంది. మరోవైపు ఇతర వర్థమాన దేశాల కరెన్సీల్లానే రూపాయి విలవిలలాడంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి వృద్ధి అంచనాల్లో కోత విధించడం, చైనా ఆర్థికాభివృద్ధి 25 సంవత్సరాల కనిష్టస్థాయికి పడిపోవడం ఇన్వెస్టర్లను భయాందోళనలకు లోనుచేసింది. దాంతో వారు ఈక్విటీలను విక్రయించి, సురక్షిత సాధనంగా భావించే పుత్తడివైపు పరుగులు తీసారు. ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి.
అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు బుధవారం ప్రపంచ మార్కెట్లతో పాటే భారత స్టాక్ మార్కెట్‌ను కుప్పకూల్చాయి. స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 24వేల పాయింట్ల దిగువకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,300 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఒకదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 640 పాయింట్లకు పైగా పతనమైంది.
చివరిలో కొంత కొనుగోళ్లు జరగడంతో 418 పాయింట్లు నష్టపోయి 24,062 పాయింట్ల వద్ద ముగి సింది. మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి(2014,మే 16) నుంచి చూస్తే ఇదే అత్యంత బలహీన స్థాయి. నిఫ్టీ 126 పాయింట్ల నష్టంతో 7,309 పాయింట్ల వద్ద ముగిసింది. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. బ్యాంక్, లోహ, రియల్టీ షేర్లు బాగా నష్టపోయాయి. ఈ ఏడాది ఇప్పటివరకే నిఫ్టీ 20% పతనమైంది.
మరింత పతనం: డాలర్‌తో రూపాయి మారకం కూడా భారీగా క్షీణించడం ప్రభావం చూపించింది. రూపాయి ఇంట్రాడేలో 68 మార్క్ దిగువకు పడిపోయింది. ముడి చమురు సరఫరా మరింతగా పెరుగుతుందని, దరలు మరింతగా తగ్గుతాయనే ఆందోళనకు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం భయాలు కూడా తోడవుతుండటంతో మార్కెట్లు మరింత పతనమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, రూపాయి క్షీణత ఇన్వెస్టర్ల ఆందోళనను మరింత అధికం చేస్తున్నాయని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ వ్యాఖ్యానించారు.
ప్రపంచ మార్కెట్లు సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశాల్లేవని రోబొబ్యాంక్కు చెందిన మైఖేల్ ఇవ్‌రీ వ్యాఖ్యానించారు. అయితే లార్జ్ క్యాప్ షేర్లు కొనుగోలు చేయడానికి ఇదే సరైన తరుణమని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఎస్. నరేన్ పేర్కొన్నారు. చైనా మందగమనం, ముడి చమురు ధరల పతనం, ప్రపంచ వృద్ధిపై ఆందోళనలు..మార్కెట్ పట్ల ఇన్వెస్టర్ల ప్రాధాన్యతను తగ్గిస్తున్నాయని బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ అంటున్నారు.
రోజంతా నష్టాలే..
సెన్సెక్స్ 24,326 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ప్రపంచ వృద్ధి అంచనాల తగ్గింపుతో ఆసియా మార్కెట్లు పతనంతో నష్టాలు మరింత పెరిగాయి. ఇంట్రాడేలో 23,840 పాయింట్ల కనిష్ట స్థాయిని(మంగళవారం నాటి ముగింపుతో పోల్చితే 640 పాయింట్లు నష్టం) తాకింది. ఇక నిఫ్టీ 7,242-7,471 పాయింట్ల మధ్య కదలాడింది. బీఎస్ఈలో 400 కంపెనీల షేర్లకు కొనుగోలుదారులే కరువయ్యారు. మొత్తం 411కు పైగా కంపెనీలు లోయర్ సర్క్యూట్ బ్రేకర్‌ను తాకాయి.
మూడు సెన్సెక్స్ షేర్లకే లాభాలు..
తాజా డిసెంబర్ క్వార్టర్లో అంచనాలను మించిన ఫలితాలను వెల్లడించినప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 3.7 శాతం క్షీణించి రూ.1,004 వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,613 కోట్లు ఆవిరైంది. 30 సెన్సెక్స్ షేర్లలో 3 షేర్లు (బజాజ్ ఆటో, హీరో మోటొకార్ప్, విప్రో)మాత్రమే స్వల్పంగా లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్ 5.5 శాతం నష్టపోయింది. ఎస్బీఐ 5.1%, కోల్ ఇండియా 3.45%, మారుతీ3.4%, టాటా మోటార్స్ 3.3% చొప్పున నష్టపోయాయి.
1.94 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద బుధవారం ఒక్క రోజే రూ.1.84 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.90,64,734 కోట్లకు తగ్గిపోయింది.
పుత్తడి వెలుగులు...
సురక్షిత మదుపు సాధనంగా పుత్తడికి ప్రాధాన్యత పెరుగుతోంది. బంగారం ధరలు రెండు నెలల గరిష్ట స్థాయికి ఎగిశాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.340 పెరిగి రూ.26,690కు చేరింది. అంతర్జాతీయంగానూ పుత్తడి మెరుపులు మెరిపిస్తోంది. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర కడపటి సమాచారం అందేసరికి 1.5% ఎగసి 1,107 డాలర్లకు పెరిగింది.
పాతాళానికి ప్రపంచ సూచీలు
ఐఎంఎఫ్ వృద్ధి అంచనాల్లో కోత, ముడి చమురు ధరల పతనం కారణంగా ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టాల పాలయ్యాయి. ఆసియా మార్కెట్లు 1-4 శాతం, యూరప్ మార్కెట్లు 3-6 శాతం నష్టపోయాయి. ముఖ్యంగా జపాన్, హాంకాంగ్ 3%పైగా పడిపోయాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా మార్కెట్లు దాదాపు 3% నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ పతనం మరింతగా కొనసాగుతుందని, మరో రెండు, మూడు నెలల వరకూ బేర్ మార్కెట్ తప్పదని విశ్లేషకులు అంటున్నారు.
ఎందుకీ పతనం...
వృద్ధి అంచనాల్లో కోత: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు భారీ నష్టాలపాలయ్యాయి. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 3.6 శాతంగా ఉండొచ్చని గతంలో పేర్కొన్న అంచనాలను ఐఎంఎఫ్ తాజాగా 3.4 శాతానికి తగ్గించింది. వచ్చే ఏడాది వృద్ధి అంచనాలను 3.8 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గిం చింది. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తుతుందేమోనన్న ఆందోళన, రుణ ఎగవేతలు పెరిగిపోతాయని, మరో మందగమనం తప్పదేమోనన్న భయాలు ఇన్వెస్టర్లను వణికించాయి. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
27 డాలర్ల దిగువకు క్రూడ్: అధిక సరఫరాల కారణంగా ముడి చమురు ధరలు మరింత పతనమవుతాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) హెచ్చరించడం ముడి చమురు ధరలను మరింత క్షీణింప జేసింది. కడపటి సమాచారం అందేసరికి న్యూయార్క్ లైట్‌స్వీట్, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధరలు 12 ఏళ్ల కనిష్ట స్థాయిలో 27 డాలర్ల దిగువకు దిగజారాయి.
తరలుతున్న విదేశీ నిధులు: విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. వీరి నికర అమ్మకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
చైనా మందగమనం: చైనా తాజా జీడీపీ గణాంకాలు ఆ దేశ మందగమనాన్ని సూచిస్తుండటంతో ప్రపంచ మార్కెట్లపైనా ప్రభావం చపుతోంది.
28 నెలల కనిష్టానికి రూపాయి: మార్కెట్ల పతనంతో డాలర్‌తో రూపాయి మారకం 28 నెలల కనిష్టానికి పడిపోయింది. దిగుమతిదారుల నుంచి డా లర్లకు డిమాండ్ పెరగడంతో 23 పైసలు నష్టపోయి 67.95 వద్ద ముగిసింది.