రెండు నెలల కనిష్టానికి సెన్సెక్స్
బలహీన అంతర్జాతీయ సంకేతాలు
* 256 పాయింట్ల క్షీణతతో 25,611కు సెన్సెక్స్
* 66 పాయింట్లు క్షీణించి 7,762కు నిఫ్టీ
ద్రవ్యోల్బణం పెరగడం, తయారీ రంగ ఉత్పత్తి తగ్గడం వంటి దేశీయ అంశాలకు తోడు ప్రతికూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాల కారణంగా స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ వృద్ధికి సంబంధించి తాజాగా ఆందోళనలు ఉత్పన్నం కావడంతో అమ్మకాలు జోరుగా జరిగాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 256 పాయింట్లు నష్టపోయి 25,611 వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు క్షీణించి 7,762 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పతనమైంది. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లు పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ధరలు కొన్నేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావాన్నే చూపుతోంది. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఆరింటిలో స్టాక్ మార్కెట్ నష్టపోయింది.
రోజంతా నష్టాలే...
సెప్టెంబర్‌లో తయారీ రంగ వృద్ధి 3.6 శాతంగా నమోదైంది. ఇక అక్టోబర్‌లో ద్రవ్యల్బోణం నాలుగు నెలల గరిష్టానికి ఎగసింది. ఈ గణాంకాల కారణంగా ఇక వడ్డీరేట్లు తగ్గే అవకాశాల్లేవన్న అంచనాలతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, రియల్ ఎస్టేట్, వాహన షేర్లు నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలోనే రేట్లను పెంచే అవకాశాలుండం, మార్కెట్ అంచనాలను మించి అమెరికాలో నాలుగు రెట్లకు పైగా చమురు నిల్వలున్నాయన్న వార్తలతో ముడి చమురు రెండున్నర నెలలు కనిస్ట స్థాయికి ధరలు తగ్గడం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ఈ వారంలో సెన్సెక్స్ 655 పాయింట్లు(2.49 శాతం), నిఫ్టీ 192 పాయింట్లు(2.41 శాతం) చొప్పున నష్టపోయాయి.