భారత్లో అపస్ గ్లోబల్ ఆర్అండ్డీ సెంటర్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఇంటర్నెట్ సర్వీసుల సంస్థ, అపస్ గ్రూప్ భారత్లో అంతర్జాతీయ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), టెక్నికల్ సపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నది. ఈ సెంటర్ కోసం వచ్చే మూడేళ్లలో 350 నుంచి 500 వరకూ ఉద్యోగాలివ్వనున్నామని అపస్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈఓ కూడా అయిన లీ టావో చెప్పారు. భారత్లో ప్రస్తుతం తమకు 8 కోట్ల మంది యూజర్లున్నారని, ఇక్కడ అంతర్జాతీయ ఆర్ అండ్ టీ, టెక్నికల్ సపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేయడం వల్ల ఈ సంఖ్య ఏడాది కాలంలో 2.5 కోట్లకు పెరగగలదని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ను కస్టమైజ్ చేసే అపస్కు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల యూజర్లున్నారు. ఈ సంఖ్య ఈ ఏడాది చివరి కల్లా 30 కోట్లకు, వచ్చే ఏడాది చివరికల్లా 50 కోట్లకు పెరుగుతుందని అంచనా.