సీఎం పేషి పేరుతో ఘరానా మోసం
అనంతపురం: సీఎం పేషి పేరుతో ఓ అగంతకుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. గత నెల్లో అనంతపురం జిల్లాలో విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలకు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సీఎం పేషి పేరుతో టోకరా వేశాడు. విడపనకల్ మండలం చీకలగురి గ్రామంలోని పొలంలో చెడిపోయిన విద్యుత్ కనెక్షన్ను సరిచేస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.
ఈ ఘటనకు సంబంధించి ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలంటే రూ. 15వేలు పంపాలని అగంతకుడు డిమాండ్ చేశాడు. అది నమ్మిన బాధితులు ఉరవకొండ ఆంధ్రా బ్యాంకులో 15వేల రూపాయలు జమచేశారు. డబ్బు జమ కాగానే ఆ దుండగుడు డబ్బుతో ఉడాయించినట్టు బాధితులు వాపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.