ఐపీఎల్లో అదృశ్య హస్తం పనిచేసిందా?
సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ 9 టైటిల్ గెలుస్తుందని నిజానికి ఈ టోర్నమెంటులోని ఏ దశలోనూ ఎవరూ అనుకోలేదు. అందరి కళ్లూ బెంగళూరు మీదే ఉన్నాయి. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివీలియర్స్, షేన్ వాట్సన్.. ఇలా ఒకళ్లకు మించి మరొక హిట్టర్లున్న ఆ జట్టును తలదన్నేవాడు ఎవడన్న ఊహ కూడా ఎవరికీ లేదు. కానీ ఒక అదృశ్య శక్తి మాత్రం సన్‌రైజర్స్ శక్తి మీద నమ్మకం ఉంచింది. నిరంతరం వారిని వెన్నంటి ఉంటూ ధైర్యం నూరిపోసింది. ఏ దశలోనైనా జట్టు బలాన్ని నమ్ముకోవాలి తప్ప అవతలి జట్టును అతిగా ఊహించుకుని భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది.
ఆ అదృశ్య శక్తే సన్ రైజర్స్ జట్టు మెంటార్ వెరీ వెరీ స్పెషల్.. వీవీఎస్ లక్ష్మణ్. అవును.. జట్టు మెంటార్‌గా ఉన్న లక్ష్మణ్ ప్రతి క్షణం జట్టుకు కావల్సిన నైతిక స్థైర్యాన్ని అందించాడు. ఇదే విషయాన్ని కప్పు గెలిచిన తర్వాత సన్ రైజర్స్ కీలక బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా చెప్పాడు. స్లాగ్ ఓవర్లలో రన్‌రేటును గణనీయంగా తగ్గించడంలో స్పెషలిస్టుగా మారిన భువీ.. తమకు అదృశ్యశక్తిగా మద్దతు ఇచ్చిన లక్ష్మణ్‌కు థాంక్స్ చెప్పాడు. ఆయన చాలా కీలకంగా పనిచేశారని, తెరవెనుక ఆయన చేసిన కృషివల్లే తెరముందు తాము బాగా ఆడగలిగామని, తమకు సపోర్ట్ చేసినందుకు థాంక్స్ అని ట్వీట్ చేశాడు. మొత్తమ్మీద అదృశ్య శక్తిగా మారిన లక్ష్మణ్.. సన్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడన్న మాట.
The invisible supporting the visible, who does incredibly important work. Thank for supporting us @VVSLaxman281 pic.twitter.com/p4hlsUz0j7
— Bhuvneshwar Kumar (@BhuviOfficial) 29 May 2016