ఐఎస్ఐఎస్ ఖిల్లాలో ఇరాకీ సేనలు!
బగ్దాద్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు కీలక ప్రాంతంగా ఉన్న ఇరాక్‌లోని రమాది నగరాన్ని తిరిగి చేజిక్కించుకునేదిశగా ఆ దేశ సేనలు కదులుతున్నాయి. ప్రస్తుతం రమాది నగరంలోకి ఇరాకీ సేనలు ప్రవేశించాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రమాదిలోని ఓ బంగ్లాను తమ అధీనంలోకి తెచ్చుకున్న ఇరాకీ సేనలు నగరం నుంచి ఐఎస్ ఉగ్రవాదులను తరిమేసేందుకు దాడిని ముమ్మరం చేశాయని ఆ వర్గాలు తెలిపాయి. ఇరాక్ సేనల దాడి తీవ్రతరం కావడంతో ఐఎస్ ఉగ్రవాదులు నగరంలోని ఈశాన్య ప్రాంతం దిశగా పరారైనట్టు తెలుస్తున్నది.
సున్నీ అరబ్ నగరమైన రమాది నగరం పశ్చిమ బగ్దాద్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంతో కీలకమైన ఈ ప్రాంతాన్ని ఐఎస్ ఉగ్రవాదులు గత మేలో చేజిక్కించుకోవడం ఇరాక్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ నేపథ్యంలో రమాదిని తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ఇరాక్ సేనలు గత కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా రమాది నగరంపై పట్టు సాధించిన ఇరాకీ సేనలు.. ఐఎస్ ఉగ్రవాదులను తరిమేస్తూ ముందుకుసాగుతున్నాయి.