మంత్రుల ఇళ్ల వద్ద సరిహద్దు సిత్రం!
రోడ్లకు అడ్డంగా ఐరన్ బ్యారికేడ్లు.. తుపాకులతో పహరాకాస్తున్న సరిహద్దు భద్రతాదళాలు.. అటువైపు ఎవరైనా వెళ్లాలన్నా భయపడే పరిస్థితి.. సహజంగా దేశ సరిహద్దుల్లో కనిపించే ఈ దృశ్యాలు గుంటూరు జిల్లాలో ముగ్గురు మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ ఇళ్ల వద్ద కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనను అడ్డుకోలేని సీమాంధ్ర ప్రాంత మంత్రుల ఇళ్లపై సమైక్యవాదులు దాడి చేస్తారేమోననే అనుమానంతో పోలీసు అధికారులు మం త్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిహద్దు భద్రతా దళాలను నియమించారు. ఆయా ఇళ్ల నుంచి వెళ్లే అన్ని రహదారులను బ్యారికేడ్లతో మూసేశారు.
దీంతో ఆ సమీపంలోని ప్రజలు తమ ఇళ్లకు వెళ్లాలంటే రెండు, మూడు కిలోమీటర్ల దూరం చుట్టుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. గుంటూరులో మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాదరావు ఇళ్ల వద్ద, నరసరావుపేటలో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఇంటివద్ద, తెనాలిలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంటి వద్ద ఈ బలగాలున్నాయి. నరసరావుపేటలో 120 రోజులుగా సుమారు 70మంది బీఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
- సాక్షి, నరసరావుపేట