ISIS chief
-
బాగ్దాదీ హతం: ఫొటోలు, వీడియో విడుదల
వాషింగ్టన్ : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని తమ సేనలు మట్టుబెట్టిన తీరు అభినందనీయమని అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ అన్నారు. బాగ్దాదీని హతం చేసే క్రమంలో సాధారణ పౌరులెవరూ గాయపడకుండా ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు. సిరియాలో మారణహోమం సృష్టించి.. ప్రపంచ దేశాలకు సవాలు విసిరిన బాగ్దాదీని అగ్రరాజ్య సైన్యం ఆదివారం అంతమొందించిన విషయం తెలిసిందే. సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ తలదాచుకున్న బాగ్దాదీని అమెరికా సేనలు చుట్టుముట్టడంతో.. తనను పేల్చుకుని అతడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తునాతునకలైన శరీర భాగాల నుంచి డీఎన్ఏను ఘటనాస్థలిలోనే సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు అది బాగ్దాదీ మృతదేహమేనని ధ్రువీకరించారు. అనంతరం ఒసామా బిన్‌లాడెన్ తరహాలోనే బాగ్దాదీ శరీర భాగాలను సముద్రంలో కలిపేశారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీని పట్టించింది అతడే!) ఇక బాగ్దాదీ చేతుల్లో చిత్రహింసలు అనుభవించి హత్యగావించబడిన అమెరికా మానవహక్కుల కార్యకర్త కైలా ముల్లర్ పేరిట చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పెంటగాన్ గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా జనరల్ ఫ్రాంక్ మెకెంజీ మాట్లాడుతూ... ‘ బాగ్దాదీని అంతమొందించడంలో ఇంటలిజెన్స్ వర్గాలు కీలకంగా వ్యవహరించాయి. అతడు తలదాచుకున్న చోటును కచ్చితంగా కనిపెట్టగలిగాం. పక్కా ప్లాన్ ప్రకారం అతడి ఇంటిని చుట్టుముట్టి ప్రత్యేక బృందాల సహాయంతో అంతమొందించాం. ఇందులో హెలికాప్టర్ దాడులు ప్రముఖమైనవి. అవి సిరియాకు చేరుకున్న అనంతరం ఆపరేషన్ మరింత కఠినతరంగా మారినట్లు అనిపించింది. అయితే లక్ష్యాన్ని పక్కాగా ఛేదించడం(బాంబులు వేయడం)లో ఆ రెండు హెలికాప్లర్టు సఫలీకృతమయ్యాయి. సాధారణ పౌరులెవరూ గాయపడకుండా జాగ్రత్త వహించాయి. ఇంటలెజిన్స్, అమెరికా సైన్యం సహాయంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశాం. ప్రపంచ దేశాలకు సవాలు విసిరిన ఉగ్రవాదిని సమూలంగా నాశనం చేశాం’ అని పేర్కొన్నారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీని వేటాడింది ఈ కుక్కే!) -
ఎవరిపై.. ఎప్పుడు దాడిచేస్తామో తెలీదు: అమెరికా
వాషింగ్టన్ : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని హతమార్చి ఐసిస్ ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీచేశామని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ అన్నారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పక్కా పథకం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాయువ్య సిరియాలో అమెరికా సైన్యం బాగ్దాదీని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. అమెరికా మానవ హక్కుల కార్యకర్త కైలా ముల్లర్ పేరిట చేపట్టిన రహస్య ఆపరేషన్‌లో అమెరికా సేనలు బాగ్దాదీని అంతం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మార్క్ మాట్లాడుతూ.. పాశవిక దాడులు, హత్యలకు.. నరమేధానికి కారణమైన బాగ్దాదీని హతం చేసే క్రమంలో ఒక్క అమెరికా సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని తెలిపారు. బాగ్దాదీ అంతం తర్వాత కూడా సిరియాలో ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయని.. కొన్ని బాహ్య శక్తులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘సిరియాలో ఐసిస్‌ను ఓడించేందుకు 2014 నుంచి ప్రయత్నించాం. ఇందులో భాగంగా ఐసిస్ చర్యలకు అడ్డుకట్ట వేయడంతో అధ్యక్షుడు ట్రంప్ సూచనలతో కొన్ని రోజుల క్రితం అమెరికా సేనలు వెనక్కి వచ్చాయి. అయితే ఏరివేయగా అక్కడ మిగిలిపోయిన కొంతమంది ఉగ్రవాదులు మరోసారి విధ్వంసానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సిరియన్ డెమొక్రటిక్ బలగాలు మాకు సహకరించాయి. దీంతో వాయువ్య సిరియాలో మేము పట్టుబిగించాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీని వేటాడింది ఈ కుక్కే!) ఇక బాగ్దాదీ హతమైన నేపథ్యంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ అలెగ్జాండర్ మిల్లీ మాట్లాడుతూ... బాగ్దాదీని అంతమొందించడంలో ఇంటలెజిన్స్, రక్షణ శాఖలు సమన్వయంతో పనిచేశాయని పేర్కొన్నారు. టర్కీ బార్డర్లో ఉన్న ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో బాగ్దాదీ జాడను కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ‘ ఈ రహస్య ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు అమెరికా దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు వాటిని విడుదల చేయలేము. డీక్లాసిఫికేషన్(డాక్యుమెంటేషన్ ప్రాసెస్) చేసిన తర్వాత భవిష్యత్తులో అవి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అమెరికా సైన్యం లక్ష్యం ఎక్కడున్నా.. ఎంత దుర్భేద్యమైనది అయినా దానిని ఛేదించడంలో ఏమాత్రం తడబడదు. టార్గెట్‌ను కొట్టి తీరుతుంది. మా దగ్గర ఎంతో గొప్పదైన సైన్యం ఉంది. ఎవరిపైనైనా.. ఎక్కడి నుంచైనా.. ఏ సమయంలోనైనా మేము దాడి చేయగలం. కాబట్టి ఉగ్రవాదులంతా అప్రమత్తంగా ఉండండి’ అని హెచ్చరించారు. అదే విధంగా సిరియాలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు సిరియన్ డెమొక్రటిక్ బలగాలతో తాము కలిసి పనిచేస్తూనే ఉంటామని మిల్లే స్పష్టం చేశారు. -
ఐసిస్ చీఫ్ బాగ్దాదీని పట్టించింది అతడే!
బాగ్దాద్ : సిరియాలో మారణహోమం సృష్టించిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్-అల్- బాగ్దాదీని మట్టుబెట్టేందుకు అతడి ప్రధాన అనుచరుడు ఇచ్చిన సమాచారమే తోడ్పడిందని ఇరాక్ భద్రతా అధికారులు తెలిపారు. సిరియాను నరకప్రాయం చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా వేళ్లూనుకుపోయిన ఉగ్రమూక ఐఎస్ చీఫ్‌ను అమెరికా సేనలు ఆదివారం హతం చేసిన విషయం తెలిసిందే. చిన్నారులు సహా వేలాది మంది సిరియన్లను దారుణంగా హతమార్చిన అబు బాకర్ బాగ్దాదీని తమ సైన్యం చుట్టుముట్టడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ‘ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఐఎస్ ఉగ్రవాద సంస్థ వేలాది మంది ప్రాణాలను తీసింది. కానీ.. దాని స్థాపకుడు బాగ్దాది చివరికి ఒక పిరికివాడిలా తనను తాను అంతం చేసుకున్నాడు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అబు బాకర్‌ను అంతమొందించడంలో తమకు సహకరించిన సిరియా కుర్దిష్ వర్గాలు, రష్యా, టర్కీ తదితర మిత్రదేశాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఇరాక్ భద్రతా అధికారులు ఈ ఆపరేషన్‌లో అబు బాకర్ ప్రధాన అనుచరుడు ఇస్మాయిల్ అల్-ఇతావీ ఇచ్చిన సమాచారం ఎంతగానో ఉపయోగపడిందంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదిని మేం చంపలేదు.. కానీ) కూరగాయల బస్సుల్లో వెళ్లేవాడు.. అబు బాకర్ జాడ కోసం అన్వేషిస్తున్న క్రమంలో అతడి ప్రధాన అనుచరుడు ఇతావీ 2018 ఫిబ్రవరిలో టర్కిష్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని ఇరాక్ సేనలకు అప్పగించారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా... ‘ఐదు ఖండాలలో తన ఉన్మాదంతో విధ్వంసం సృష్టించిన అబు బాకర్ ఎల్లప్పుడూ మినీ బస్సుల్లోనే తన సహచరులతో సమావేశమయ్యాడు. కూరగాయలతో నిండిన ఆ బస్సుల్లో వారంతా దొంగచాటుగా గమ్యస్థానాలకు చేరుకునేవారు. ఇస్లామిక్ సైన్సెస్‌లో పీహెచ్డీ చేసిన ఇతావీ అబు బాకర్ ఐదుగురు ముఖ్య అనుచరుల్లో ఒకడు. అతడు 2006లో ఉగ్ర సంస్థ ఆల్ ఖైదాలో చేరాడు. 2008లో అమెరికా సేనలకు పట్టుబడటంతో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో ఇతావీ గురించి తెలుసుకున్న అబు బాకర్ తమతో చేతులు కలపాల్సిందిగా అతడిని కోరాడు. ఈ క్రమంలో మత పరమైన సూచనలు ఇవ్వడంతో పాటు ఇస్లామిక్ స్టేట్ కమాండర్లను ఎంపిక చేయడంలోనూ ఇతావీ కీలక పాత్ర పోషించేవాడు. ఇందులో భాగంగా 2017లో తన సిరియన్ భార్యతో కలిసి పూర్తిగా సిరియాకే మకాం మార్చాడు. అయితే 2018లో టర్కీ అధికారులకు అతడితో పాటు నలుగురు ఇరాకీలు, ఒక సిరియన్ చిక్కాడు. దీంతో వాళ్లను మాకు అప్పగించారు. అప్పుడే ఇతావీ మాకు బాగ్దాదీ గురించిన రహస్యాలన్నీ చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు సిరియాలోని ఇడ్లిబ్ అనే ప్రాంతంలో అబు బాకర్ తల దాచుకున్నాడని మాకు తెలిసింది. అయితే ఇడ్లిబ్‌పై పట్టు కలిగి ఉన్న, ఐఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే మరో ఉగ్రసంస్థ నుస్రా ఫ్రంట్ అబు బాకర్‌ను చంపేందుకు వెంటపడటంతో.. అతడు తరచుగా వివిధ ప్రాంతాలకు పయనమయ్యేవాడు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు, ముగ్గురు అనుచరులను ఎల్లప్పుడూ వెంటబెట్టుకునేవాడని ఇతావీ తెలిపాడు. అదే విధంగా అతడు ఏయే సమయాల్లో ఏ చోట తల దాచుకుంటాడనే విషయాన్ని కూడా మాకు చెప్పాడు. దీంతో మేము అమెరికా భద్రతా సంస్థ సెంట్రల్ ఇంటలెజిన్స్ ఏజెన్సీతో సమన్వయం చేసుకుని... ఇడ్లిబ్ సమీప ప్రాంతాల్లో ఎక్కువ సైన్యాలను మోహరించాలని సూచించాం. ఈ క్రమంలో గత ఐదు నెలలుగా సీఐఏ డ్రోన్స్, సాటిలైట్స్‌తో ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఇప్పుడు అబు బాకర్ హతమయ్యాడు అని ఇరాక్ అధికారులు వెల్లడించారు. -
ఐసిస్ చీఫ్ అంతానికి ‘కిల్ మిషన్’
లండన్: ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) చీఫ్ అబుబకర్ అల్ బాగ్దాదీని మట్టుబెట్టేం దుకు అమెరికా ప్రత్యేక దళాలతో కలసి బ్రిటన్‌కు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ (ఎస్ఏఎస్).. ‘కిల్ మిషన్’ను ప్రారంభిం చింది. ఈ మిషన్ ఎస్ఏఎస్ స్నైపర్స్ నేతృత్వంలో సాగనుండగా.. కోవర్టు దళాలు సిరియా, ఇరాక్‌లోని ఐసిస్ స్థావరాలను పర్యవేక్షించనున్నాయి. ‘ప్రస్తుతం ఐసిస్ చీఫ్ ప్రధాన టార్గెట్. అబు బకర్‌ను అంతమొందించేందుకు ఎస్ఏఎస్ తమ ఇన్నేళ్ల అనుభవాన్ని, నైపుణ్యాన్ని వినియోగిస్తోంది’ అని రక్షణ శాఖ అధికారి ‘డైలీ స్టార్’ పత్రికకు తెలిపారు. అబు బకర్ తలపై బహుమతిని అమెరికా ప్రభుత్వం 25 మిలియన్ డాలర్లకు పెంచింది. -
అతడు సజీవంగానే ఉన్నాడు, వేటాడతాం: అమెరికా
వాషింగ్టన్: ఉగ్ర సంస్థ ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్–బాగ్దాదీని మట్టుబెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ఇంకా సజీవంగానే ఉన్నాడని నమ్ముతున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. తాను 2014లో ఖలీఫా రాజ్యాన్ని ప్రకటించిన, ప్రస్తుతం బలగాల ముట్టడిలో ఉన్న మోసుల్ పట్టణంలోనే ఉన్నాడా అన్న దానిపై స్పష్టత లేదని తెలిపింది. ‘బాగ్దాదీ ప్రాణాలతో ఉన్నాడని, ఐసిస్‌ను నడిపిస్తున్నాడని నమ్ముతున్నాం. అయన కదలికలు పసిగట్టేందుకు చేయాల్సినదంతా చేస్తున్నాం. ఆయనకు తగిన శాస్తి చేయడానికి దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోం. ఇందుకోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం’ అని పెంటగాన్ ప్రతినిధి పీటర్ కుక్ చెప్పారు. సంకీర్ణ దళాలు చాలా మంది ఐసిస్ సభ్యులను అంతమొందించడంతో బాగ్దాదీకి సలహాలు ఇచ్చేవారు కరువయ్యారని, ఆయన ఒంటరైపోయారని తెలిపారు. బగ్దాదీ తలపై బహుమానాన్ని అమెరికా ఈ మధ్యే రెండింతలు పైగా పెంచుతూ 25 మిలియన్ డాలర్లు చేసింది. ఐసిస్ చివరిసారిగా విడుదల చేసిన 2014 నాటి వీడియోలో బాగ్దాదీగా భావిస్తున్న వ్యక్తి నెరిసిన గడ్డం, నల్ల దుస్తులు, తలపాగాతో కనిపిస్తూ మోసుల్‌ను కాపాడుకోవాలని మద్దతుదారులకు సందేశమిచ్చాడు. 2016, జూన్ లో సంకీర్ణ దళాల దాడుల్లో అబు బకర్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అతడు బతికేవున్నట్టు అమెరికా తాజాగా ప్రకటించింది. -
ఐసిస్ అధినేత హతం?
సంకీర్ణ దళాల దాడుల్లో అబు బకర్ చనిపోయినట్లు వార్తలు రోమ్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బగ్దాదీ సిరియాలోని రక్కాలో అమెరికా సంకీర్ణ దళాలు జరిపిన దాడిలో హతమైనట్లు టర్కీ వార్తా పత్రిక కథనం ప్రచురించింది. అయితే.. అమెరికా సంకీర్ణ దళాలు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. రెండేళ్ల కిందట ప్రపంచంలోని ముస్లింలకు తనను తాను ఖాలిఫ్‌గా ప్రకటించుకున్న బకర్ హతమయ్యాడని, గాయపడ్డాడని గతంలోనూ వార్తలు వచ్చినా.. అవి అవాస్తవమని తేలింది. తాజాగా.. గత ఆదివారం రక్కా ప్రాంతంలో సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లో బకర్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ‘బకర్ రంజాన్ మాసం ఐదో రోజున సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లో చనిపోయాడు’ అని ఐసిస్ అనుబంధ వార్తాసంస్థ అల్-అమాక్ వెల్లడించినట్లు టర్కీ అధికారిక పత్రిక యేనిస్ సఫాక్ పేర్కొంది. ఈ దాడుల్లో బకర్ గాయపడ్డట్లు ఇరాక్ టీవీ చానల్ అల్-సుమేరియా కూడా కథనం ప్రసారం చేసింది. -
ఐఎస్ఐఎస్ అధినేత హతం
అబూబకర్ అల్ బాగ్దాదీ.. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా అధినేత. ఈ ఉగ్రవాద సంస్థను స్థాపించి, ప్రపంచం నలుమూలలా ఉగ్రవాద దాడులతో అల్లకల్లోలం సృష్టిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి తాజాగా అమెరికా నేతృత్వంలో జరిగిన వైమానిక దాడులలో హతమైనట్లు కథనాలు వస్తున్నాయి. ఐఎస్ఐఎస్ అనుబంధ అరబిక్ వార్తా సంస్థ అల్ అమాక్ ఈ విషయాన్ని తెలిపింది. అమెరికా సాగించిన వైమానిక దాడులలో అల్ బాగ్దాదీ మరణించాడని ఈ వార్తా సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా గానీ, ఇతర అధికారిక వార్తా సంస్థలు గానీ ఏవీ నిర్ధారించలేదు. సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో బాగ్దాదీ హతమైనట్లు తెలుస్తోంది. ఐఎస్ఐస్ ఆధీనంలో ఉన్న మోసుల్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని అంటున్నారు. -
ఐఎస్ఐఎస్ చీఫ్ అల్ బాగ్దాదీ మృతి!
టెహ్రాన్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ అమెరికా దాడుల్లో అయిన గాయాల వల్ల మృతిచెందాడని ఇరాన్ ప్రభుత్వ రేడియో సోమవారం వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని ఐఎస్ఐఎస్పై దాడులు చేస్తున్న అమెరికా సహా పలు దేశాలు ధ్రువీకరించలేదు. గత నెల ఇరాక్‌లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో బాగ్దాదీ గాయపడినట్లు వార్తలు రావడం తెలిసిందే. -
బాంబుదాడిలో ఐఎస్ఐఎస్ చీఫ్ అల్ బాగ్దాదీ హతం
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ మరణించాడు. అతడి మృతిని ఇరాన్ రేడియో ధ్రువీకరించింది. ఇటీవలే అమెరికా సైన్యాలు వైమానిక మార్గంలో చేసిన క్షిపణి దాడిలో అల్ బాగ్దాదీ తీవ్రంగా గాయపడ్డాడు. సిరియా సరిహద్దుల్లోని అల్బాజ్ జిల్లా నైన్వేలో కురిపించిన బాంబుల వర్షంలో బాగ్దాదీకి గాయాలయ్యాయి. ఆ గాయంతో బాధపడుతూనే బాగ్దాదీ మరణించినట్లు ఇరాన్ రేడియో స్పష్టం చేసింది. కాగా బాగ్దాదీ తలకు ఇప్పటికే అమెరికా రూ. 65 కోట్ల వెల కట్టింది. గత జూలై నెలలో చివరి సారిగా బాగ్దాద్‌లోని ఓ మసీదులో బాగ్దాదీ ప్రసంగించాడు. ఆ తర్వాత ఎప్పుడూ బయట కనిపించలేదు. కాగా, పాశ్చాత్య దేశాలను వణికిస్తున్న ఐఎస్ఐఎస్కు బాగ్దాదీ మరణం పెద్ద దెబ్బ అవుతుంది. అనేకమందిని పీకలు కోసేసి హతమార్చి, ఆ వీడియోలను సైతం ఆన్లైన్లో పోస్ట్ చేసి భయానక వాతావరణాన్ని ఐఎస్ఐఎస్ సృష్టించిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ రాజ్యం అన్న నినాదాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లి, ఐఎస్ఐఎస్ను అల్ బాగ్దాదీ స్థాపించాడు. అలాగే ఐఎస్ఐఎస్ను టెర్రరిస్టు గ్రూపుగా మార్చడంలో కూడా అల్ బాగ్దాదీ కీలకపాత్ర పోషించాడు. అత్యంత కిరాతకంగా హత్యలు చేయాలంటూ తన 'సైన్యాన్ని' ఆదేశించి అగ్రరాజ్యాలను వణికించాడు. మేం నమ్మం: అమెరికా అయితే.. అమెరికా మాత్రం బాగ్దాదీ మరణించిన విషయాన్ని తాము నమ్మేది లేదని చెబుతోంది. అతడి మృతదేహాన్ని చూసేవరకు ఈ కథనాలను విశ్వసించబోమని పెంటగాన్ తెలిపింది. గతంలో కూడా ఇలాంటి వదంతులతో తమ దృష్టిని మళ్లించారని చెప్పింది. -
బాంబు పెడుతూ పేలిపోయాడు
పెషావర్: పాకిస్థాన్‌లో ఐఎస్ఐఎస్ టెర్రరిస్టుల చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ గురువారం పాక్‌లోని ఖైబర్ ట్రైబల్ ప్రాంతంలో రోడ్డుపక్కన బాంబును అమర్చబోతూ అనుకోకుండా అది పేలిపోవడంతో ముక్కచెక్కలై మరణించాడు. ఈ విషయాన్ని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. అయితే టెర్రరెస్టు వర్గాలు మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. ప్రపంచంలో మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టుగా అమెరికా ముద్ర వేసిన హఫీజ్‌తోపాటు మరో ఇద్దరు అతని అనుచరులు బాంబు పేలుడు ఘటనలో మరణించారని పాకిస్తాన్ సైనిక వర్గాలు తెలిపాయి. అయితే ఆ చనిపోయిందీ హఫీజ్ అవునా, కాదా అన్న విషయాన్ని ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని ఆ వర్గాలు చెప్పాయి. ఇంతకుముందు పాకిస్తాన్‌లోని పలు ఉగ్రవాద గ్రూపులకు నాయకత్వం వహించినా హఫీజ్ ఆ తర్వాత ఐఎస్ఐఎస్ గ్రూప్‌లో చేరిపోయారు.