సతీష్.. గో బ్యాక్
వేంపల్లె, న్యూస్‌లైన్ : ఇడుపులపాయలోని ట్రిపుల్‌ఐటీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డికి గురువారం చేదు అనుభవం ఎదురైంది. టీడీపీకి ఓటు వేసే ప్రసక్తే లేదని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తేల్చి చెప్పారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న జేసీ దివాకర్‌రెడ్డిని ఎలా టీడీపీలో చేర్చుకున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇక్కడినుంచి వెళ్లిపోవాలని కోరారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డితోపాటు కొంతమంది టీడీపీ నాయకులు ట్రిపుల్ ఐటీ ఆటస్థలంలో విద్యార్థులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీకి ఓటు వేయాలని కోరారు. వైఎస్ అవినీతికి పాల్పడి కోట్లు సంపాదించారని సతీష్‌రెడ్డి విమర్శించడంతో విద్యార్థులు అభ్యంతరం తెలిపారు. వైఎస్ వల్లే 6 వేల మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారన్నారు. తన సొంత భూమి 360 ఎకరాలను ట్రిపుల్ ఐటీకి దానం చేశారన్నారు. అనంతపురం జిల్లాలో తాడిపత్రికి చెందిన జేసీ దివాకర్‌రెడ్డిని టీడీపీలోకి ఎందుకు చేర్చుకున్నారని.. ఆయన దౌర్జన్యాలకు పాల్పడలేదా అని సూటిగా ప్రశ్నించారు. దీంతో కొంతమంది టీడీపీ నాయకులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థులనుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వారు వెనుదిరిగారు.
టీడీపీకి ఓటు వేసే ప్రసక్తే లేదు :
ట్రిపుల్ ఐటీలో 6వేలమంది పేద విద్యార్థులకు వైఎస్ పుణ్యమా అని అవకాశం వచ్చింది. మీకు ఓటు వేయమంటే ఎలా వేస్తాం.. టీడీపీకి ఓటు వేసే ప్రసక్తే లేదు. వైఎస్ కుటుంబానికే మా ఓటు వేస్తాం.
- రాహుల్‌గౌడ్, ట్రిపుల్ ఐటీ విద్యార్థి, ఇడుపులపాయ
జేసీని ఎలా చేర్చుకున్నారు
వైఎస్ కుటుంబం హత్యా రాజకీయాలకు పాల్పడిదంటున్నారు.. తాడిపత్రికి చెందిన జేసీ దివాకర్‌రెడ్డి హింసా రాజకీయాలకు, దౌర్జన్యాలకు పాల్పడలేదా.. టీడీపీలోకి ఎలా చేర్చుకున్నారు..
- గంగరాజు, ట్రిపుల్ ఐటీ విద్యార్థి, ఇడుపులపాయ
తప్పతాగి ప్రచారం చేయడం భావ్యమా..
నాలుగు రోజుల క్రితం టీడీపీ నాయకులు తప్పతాగి వచ్చి ప్రచారం చేయడం భావ్యమా.. ఇది పద్దతి కాదు.. ఇలా ప్రచారం చేస్తే ఓట్లు వేస్తారా.. తాగి ప్రచారం చేయడంవల్ల భయాందోళనకు గురయ్యాం.
- బాబుల్‌రెడ్డి, టిపుల్ ఐటీ విద్యార్థి, ఇడుపులపాయ
చంద్రబాబు అంత ఆస్తి ఎలా సంపాదించారు
వైఎస్ రాజశేఖరరెడ్డిఅవినీతికి పాల్పడ్డారంటున్నారు.. మన మధ్యలేని ఆయనపై నిందలు వేయడం సరికాదు. రెండు ఎకరాల భూమితో సింగఫూర్లో హోటల్‌ను, ఇతర ఆస్తులను, రూ. 20వేల కోట్ల ఆస్తులను చంద్రబాబు, ఎలా సంపాదించారు.
- అహమ్మద్, ట్రిపుల్ ఐటీ విద్యార్థిని, వేంపల్లె