ప్రత్యేక రాష్ట్రంలో వ్యవసాయాధికారులకు ఉద్యోగోన్నతులు
ఖమ్మం వ్యవసాయం: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఇక్కడి వ్యవసాయ శాఖాధికారులకు ఉద్యోగోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్‌సుందర్ రెడ్డి అన్నారు. సంఘం ఖమ్మం యూనిట్ వార్షిక సమావేశం జిల్లా అధ్యక్షుడు కొంగర వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం ఖమ్మంలో జరిగింది.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం లోని 15మంది వ్యవసాయాధికారులకు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకుల స్థాయి పోస్టులు, 30మంది వ్యవసాయాధికారులకు ఉప సంచాలకుల స్థాయి పోస్టులు వచ్చే అవకాశముందని అన్నారు. వ్యవసాయాధికారుల వేతనాలు, ఇతర ప్రయోజనాలపై పే రివిజన్ కమిటీకి రాష్ట్ర వ్యవసాయాధికారుల సంఘం సమగ్ర నివేదిక ఇచ్చిందన్నారు. వ్యవసాయాధికారుల సర్వీస్ సంబంధ సమస్యలను రాష్ట్రస్థాయిలో పరిష్కరిస్తామన్నారు.
సహాయ వ్యవసాయ సంచాలకుల పోస్టులను రాష్ట్రస్థాయి పోస్టులుగా గుర్తించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు చెప్పారు. దీని ద్వారా ఉద్యోగాలలో సమతుల్యం పాటించే అవకాశముందన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం పరిశీలించిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో మొట్టమొదటి రికగ్నైజ్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘంగా ఆవిర్భవించింది తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘమేనని అన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఖాజామియా; వ్యవసాయాధికారుల సంఘం జిల్లా ఫౌండర్ చైర్మన్, విశ్రాంత జేడీఏ చంద్రమోహన్, వ్యవసాయాధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారాంరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సుధాకర్‌రావు, కోశాధికారి అరుణ జ్యోతి, సహాయ వ్యవసాయ సంచాలకులు మణిమాల, అంజమ్మ, వాణి, స్వరూపరాణి, సరిత, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.