జూన్ 5 నుంచి దూరవిద్య పరీక్షలు
ఎస్కేయూ : వర్సిటీ దూరవిద్య విధానం ద్వారా పీజీ, డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు జూన్ 5 నుంచి నిర్వహించనున్నట్లు దూరవిద్య విభాగం అధికార వెబ్సైట్లో పేర్కొన్నారు. ‘ దూర మిథ్య’ అనే శీర్షికతో మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై వర్సిటీ యాజమాన్యం స్పందించింది. 19 నెలలు గడుస్తున్నప్పటికీ దూరవిద్య పీజీ, డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్ ప్రకటించలేదు. కథనం ప్రచురితమైన రోజే ఇదే అంశంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేశారు.
వర్సిటీ యాజమాన్యం మంగళవారం పరీక్షల విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పరీక్షల షెడ్యూల్ ప్రకటించాలని వీసీ కె.రాజగోపాల్ ఆదేశాలు జారీ చేయడంతో షెడ్యూల్ ఖరారు చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం మొదటి సంవత్సరం విద్యార్థులు, లేటలర్ ఎంట్రీ విద్యార్థులకు జూన్ 5 నుంచి పరీక్షలు ఉంటాయి. 12న డిగ్రీ పరీక్షలు, 11న పీజీ పరీక్షలు ముగియనున్నాయి.