ఎంత పెద్ద కష్టమో..!
ఈ అబ్బాయి పేరు కలీం. ఉండేది గుర్గావ్ సమీపంలోని ఓ చిన్న గ్రామం. భారీ పరిమాణంలో పెరిగిపోయిన ఈ కుర్రోడి చేతులు డాక్టర్లకు సైతం పెద్ద సవాల్‌గా మారాయి. కలీం తండ్రి హషీం రోజు కూలీ. తల్లి హలీమా భిక్షాటన చేస్తోంది. సాధారణ శిశువు కంటే రెండింతల పెద్దగా ఉన్న చేతులతో జన్మించిన తమ కుమారుడిని చూసి వారు తల్లడిల్లారు. తమది అరకొర సంపాదనే అయినా, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కుమారుడ్ని చాలా మంది వైద్యులకు చూపించారు. కానీ వారెవరూ కూడా అతడికి ఉన్న వ్యాధి ఏమిటో కనుకోకలేకపోయారు. ఈ క్రమంలో కలీం ఎదుగుతున్న కొద్దీ అతడి చేతులు కూడా భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఒక్కో అర చేయి ఏకంగా 13 అంగుళాల పొడవు, దాదాపు 12 కిలోల బరువు ఉంది.
ప్రస్తుతం ఎనిమిదేళ్ల వయసున్న కలీం.. పెద్దపెద్ద చేతులు కారణంగా చిన్నచిన్న పనులు సైతం చేసుకోలేని దుస్థితిలో ఉన్నాడు. అన్నం కూడా అమ్మ తినిపించాల్సిందే. రెండు వేళ్ల మధ్య గ్లాసు పట్టుకుని మంచినీళ్లు మాత్రం తాగుతాడు. స్కూళ్లో మిగతా పిల్లలు నీ చేతులు చూసి భయపడుతున్నారని టీచర్లు చెప్పడంతో బడికి వెళ్లడం మానేశాడు. క్రికెట్‌కు వీరాభిమాని అయిన కలీం.. బ్యాటింగ్‌లో మాత్రం బాగానే దుమ్ము దులుపుతాడండోయ్. ఇటీవలే గుర్గావ్లోని ఓ వైద్య నిపుణుడు కలీంను పరీక్షించి, చికిత్స చేస్తే అతడి చేతులు సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో ఈ అబ్బాయి తల్లిండ్రుల్లో ఆశలు చిగురించాయి. తమ కుమారుడికి చికిత్సకు అవసరమైన సొమ్మును ఎలాగైనా సంపాదించాలని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.