గిట్టుబాటు ధర లేదు..పనిముట్టూ లేవు
కిసాన్ మేళాలో రైతుల అసంతృప్తి
నంద్యాలరూరల్: పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని.. సబ్సిడీపై పనిముట్లూ ఇవ్వడం లేదని పలువురు రైతులు కిసాన్ మేళాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు కొండా మోహన్‌రెడ్డి, మహానంది మండలం నందిపల్లె సాగేశ్వరరెడ్డి, ఆదర్శ రైతు బంగారురెడ్డి, అనంతపురం జిల్లా రెడ్డిపల్లె రైతు విజయకుమార్‌రెడ్డి.. తదితరులు మాట్లాడారు. పంట వేసే ముందు ధర నిర్ణయిస్తే వాటికి అనుగుణంగా రైతులు సాగు చేసుకొని నష్టాలు లేకుండా ముందుకు సాగుతారన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించేందుకు అవసరమైన యంత్రాలు, శిక్షణను ప్రభుత్వం అందించడం లేదన్నారు. ప్రభుత్వమే మార్క్‌ఫెడ్, ఆయిల్ ఫెడ్ల ద్వారా నిర్ణయించిన ధరకు పంట దిగుబడులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం నిల్వలకు అవసరమైన గోదాములు లేవని, రైతులకు పంట రుణాలు అందజేసి ప్రోత్సహించాలన్నారు. రైతు బాగు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. ప్రైవేటు, కార్పొరేట్.. విత్తన, క్రిమిసంహారక, రసాయనిక ఎరువుల కంపెనీల ధన దాహానికి రైతు బలవుతున్నారని, ప్రభుత్వం వాటిని నియంత్రించాలాన్నరు. జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు కిసాన్ మేళాకు రాకపోవడంపై రైతు ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్సిడీ వ్యవసాయ పనిముట్ల పంపిణీలో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు.