అసలే సొరంగం.. ఆపై చిమ్మచీకటి..
కోల్ కతా: అసలే సొరంగం.. ఆపై చిమ్మచీకటి.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. కోల్కతా మెట్రో ప్రయాణికులు సోమవారం ఉదయం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. సొరంగంలో ప్రయాణిస్తున్న నాన్ ఏసీ మెట్రో రైలు ఒక్కసారిగా పట్టాలపై ఆగిపోయింది. దాంతో పాటు లైట్లు కూడా ఆరిపోవడంతో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. మెట్రో సిబ్బంది సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చేవరకు వారంతా చీకటిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.
డమ్ డమ్ కు బయలుదేరిన మెట్రో రైలు పార్క్ స్ట్రీట్ స్టేషన్ దాటిన తర్వాత ఇంజిన్ చెడిపోవడంతో సొరంగంలో నిలిచిపోయింది. ఈ ఉదయం 11.25 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆఫీసులకు బయలుదేరిన వారు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాన్ ఏసీ రైలు కావడంతో గాలి ఆడక దాదాపు రెండు గంటల పాటు సతమతమయ్యారు. రైల్వే సిబ్బంది నిచ్చెనలు ఏర్పాటు చేసి ప్రయాణికులను రైలు నుంచి దించి సొరంగం బయటకు రప్పించడంతో ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనకు సంబంధించి ఎవరిపైనా చర్య తీసుకోబోమని మెట్రో అధికారులు తెలిపారు.