‘ఎల్లంపల్లి’లో కుక్కలగూడూర్
గ్రామాన్ని ముంచెత్తిన బ్యాక్‌వాటర్
మునిగిన రక్షిత మంచినీటి బావులు
తాగునీటికి గ్రామస్తుల ఇబ్బంది
బసంత్‌నగర్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ రామగుండం మండలం కుక్కలగూడూర్‌ను ముంచేసింది. రెండు రోజుల క్రితం వరకు గ్రామ శివారులోని లోలెవల్ బ్రిడ్జి వద్ద రెండడుగులు మాత్రమే ఉన్న నీరు.. ప్రాజెక్టులో నిల్వ పెరుగుతున్నకొద్దీ బ్యాక్‌వాటర్ అదేస్థాయిలో గ్రామాన్ని చుట్టుముట్టింది. ప్రస్తుతం దాదాపు రెండుమీటర్ల ఎత్తుకు చేరింది. ఫలితంగా గ్రామంలోని రక్షిత మంచినీటి బావులు మునిగిపోయాయి. దీంతో గ్రామస్తులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. సమీప గ్రామాలకు వెళ్దామన్నా.. నీటిచేరికతో రాకపోకలు స్తంభించాయి. ఎస్సీ కాలనీ నుంచి తాళ్ల బ్రిడ్జివద్దకు ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దారి లేని కూలీపనులకు వెళ్లలేకపోతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. విద్యార్థులు చదువుకునేందుకు వెళ్లడంలేదు. గీతకార్మికులు చెట్లు ఎక్కడం లేదు.
ముంపు గుర్తించని అధికారులు
ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సమయంలో కుక్కలగూడుర్ పాక్షికంగా ముంపునకు గురవుతుందని అధికారులు భావించారు. కానీ.. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బ్యాక్‌వాటర్ ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. దీంతో బాధితులు రాత్రి సమయంలో కనీసం నిద్రకూడా పోవడం లేదు. వరదనీటి నుంచి పాములు, తేళ్లు, విషపుపరుగులు వస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తమను ఇళ్లలో ఎలా ఉండమంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గ్రామం మెుత్తం మునిగిపోతున్నా.. ఇప్పటివరకు అధికారులెవరూ ఆ గ్రామం వైపు కన్నెత్తిచూడడం లేదు. కనీసం ఎంత మునిగిపోతోంది..? బాధితులు ఎందరు ఉన్నారు..? అనికూడా తెలుసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్గటూర్, ధర్మారం మండలాల పరిధి ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు.. తమ గ్రామాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గ్రామ శివారులోని బండలవాగు ప్రాజెక్టు నిండితే గ్రామం చుట్టూ నీరు చేరి తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతుందంటున్నారు. కలెక్టర్ స్పందించి తమ గ్రామాన్ని సందర్శించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
గ్రామస్తుల రాస్తారోకో
గ్రామాన్ని పూర్తిస్థాయి ముంపు ప్రాంతంగా ప్రకటించి తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గ్రామ కూడలి వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించారు. గ్రామంలో తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని yì మాండ్ చేశారు. ఆందోళనలో సర్పంచ్ బొంకూరి శంకర్, ఉప సర్పంచ్ కుదిరె సతీష్, నాయకులు బొడ్డు రాయమల్లు, మేడం మల్లయ్య, మానాల నగేష్, మల్లేశం, స్థానిక యువకులు, మహిళలు పాల్గొన్నారు.