బిందువే బంధువు
కామారెడ్డి : మాచారెడ్డి మండలం వాడికి చెందిన యువరైతు కుంట భాస్కర్‌రెడ్డికి వ్యవసాయం అంటే మక్కువ. ఆయనకు ఏడున్నర ఎకరాల సాగు భూమి ఉంది. బిందు సేద్యం పద్ధతిలో తక్కువ ఖర్చుతో పంటలు సాగు చేయవచ్చని, ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారుల ద్వారా తెలుసుకున్నాడు. తన పొలంలో రెండు డ్రిప్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నాడు.
ఒక్కో యూనిట్ ధర లక్ష రూపాయలు. అయితే ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందించింది. రెండు యూనిట్లకు కలిపి రైతుకు రూ. 20 వేలు ఖర్చయ్యాయి. ఈ డ్రిప్ యూనిట్లు పదేళ్లవరకు పనిచేస్తాయి. తనకున్న ఏడున్నర ఎకరాల భూమితోపాటు పక్కనే ఉన్న మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.
ఐదున్నర ఎకరాల్లో చెరుకు, మూడెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. పంట సాగుపై ఆయన మాటల్లోనే..
‘‘అందరిలెక్క కాకుండా ఆధునిక పద్ధతుల్లో పంట సాగు చేయాలనుకున్న. గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ అధికారుల సలహాలు తీసుకున్న. పోయిన ఏడాది డిసెంబర్లో ఐదున్నర ఎకరాల భూమిని దున్ని ఐదు అడుగులకో గెరకొట్టిన. చెరుకు గడలను పరిసి మట్టిని నింపేసిన.
డ్రిప్ పైపుల ద్వారా చెరుకు గడలకు నీరు పారిస్తున్న. వారానికోసారి డ్రిప్ ద్వారా యూరియా, క్లోరోఫైరిఫాస్ మందులను పంపిస్తున్న. ఒకసారి పొటాష్ కూడా డ్రిప్ ద్వారానే చెరుకు పంటకు వేసిన. ఇప్పటి వరకు నాలుగు బస్తాల యూరియా, మూడు బస్తాల పొటాష్ వేసిన. బొట్టుబొట్టు చెరుకుకు చేరడం వల్ల పంట ఏపుగా పెరుగుతోంది. రోజూ చెరుకు పంట వద్దకు వెళ్లి చూసుకుంటూ ఉంట. ఇప్పుడు నాకన్నా ఎత్తుగా పంట పెరిగింది. మంచి దిగుబడులు వస్తాయనుకుంటున్న’’ అని వివరించాడు రైతు భాస్కర్‌రెడ్డి. సాధారణంగా చెరుకు 35 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుందని, కానీ డ్రిప్ పద్ధతిలో సాగు చేసిన తన భూమిలో 50 నుంచి 55 టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఇప్పటివరకు సాగు ఖర్చులు
దుక్కి దున్నడం, మట్టిపెళ్లలను పగులగొట్టడానికి రూ. 25 వేలు
చెరుకు నాటడానికి రూ. 8 వేలు
ఎరువులకు రూ. 10 వేలు
ఇతర ఖర్చులు రూ. 20 వేలు
10 టన్నుల విత్తనానికి రూ. 26 వేలు
రాబోయే రోజుల్లో ఎరువులకు మరో రూ. 10 వేలు ఖర్చు కావచ్చని రైతు భాస్కరరెడ్డి పేర్కొంటున్నారు. చెరుకు నరకడానికి, ఫ్యాక్టరీకి తరలించడానికి టన్నుకు రూ. 600 చొప్పున ఖర్చవుతాయని తెలిపారు. ఎకరానికి కనీసం 50 టన్నుల దిగుబడి వస్తుందని ధీమాతో ఉన్నానన్నారు. గత సీజన్లో ఫ్యాక్టరీ టన్ను చెరుకుకు రూ. 2,600 చెల్లించిందని, ఈ లెక్కన పెట్టుబడి ఖర్చులుపోను రూ. 4 లక్షల వరకు మిగులుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.