రూ.14 వేల కోసం హత్య
రిటైర్డ్ లైన్‌మన్ హత్య కేసు ఛేదింపు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ మల్లికార్జునవర్మ
అనంతపురం క్రైం : అప్పు ఇచ్చి ఆదుకున్న ఓ రిటైర్డ్ లైన్‌మన్‌ను కేవలం రూ. 14 వేలు కోసం హత్య చేసిన కేసును ఆత్మకూరు పోలీసులు ఛేదించారు. హంతకులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 50 వేలు విలువచేసే బంగారు అభరణాలు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మల్లికార్జునవర్మ వెల్లడించారు. ఆయన మాటల్లో... ఈ ఏడాది జనవరి 20న ఆత్మకూరు మండలం పంపనూరు అటవీక్షేత్రంలో రిటైర్డ్ లైన్‌మన్ కుసులూరు వీరన్న (70) హత్యకు గురయ్యాడు. డీఎస్పీ తీవ్రంగా పరిగణించారు. కేసు ఛేదించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ క్రమంలో ఆత్మకూరు సీఐ శివనారాయణస్వామి, ఎస్ఐలు డి.టి.హుసేన్, జి.ఎస్.రాయుడు, ఏఎస్ఐ అయూబ్‌ఖాన్, హెడ్‌కానిస్టేబుళ్లు సూర్యనారాయణ, రాజశేఖర్, నరసింహులు, గోపాల కానిస్టేబుళ్లు జగదీష్, పాండవ, ఈశ్వర్‌నాయక్, సుధాకర్, బసన్న, రఫి, మహేష్, నాగవేణి, హోంగార్డు రమణ ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. విచారణ ముమ్మరం చేశారు. పక్కా సమాచారం అందడంతో సోమవారం నిందితులైన పామిడి మండలం కత్రిమలకు చెందిన బండి నాగేంద్ర, నీలం మాధవిని అరెస్టు చేశారు.
ఇదీ నేపథ్యం..
వీరన్న ట్రాన్స్‌కోలో లైన్‌మన్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. జేఎన్టీయూ సమీపంలోని ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి నిందితుల్లో ఒకరైన బండి నాగేంద్ర వరుసకు అల్లుడవుతాడు. నెలకిందట నాగేంద్ర వీరన్న వద్ద రూ. 14 అప్పుగా తీసుకున్నాడు. డబ్బు చెల్లించమని ఒత్తిడి చేస్తుండటంతో ప్రియురాలితో కలిసి హత్య చేశాడు.
కఠినంగా వ్యవహరిస్తాం : డీఎస్పీ
పవిత్ర పరసరాలను అపవిత్రం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ మల్లికార్జునవర్మ హెచ్చరించారు. ఆత్మకూరు మండలం పంపనూరు పరిసరాలు చాలా పవిత్రమైనవని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ఇకపై అక్కడ పోలీసు నిఘా పెంచుతామని తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు.