రాజమహేంద్రికి కళ తెస్తాం
రాజమండ్రి / రాజమండ్రి రూరల్: కళాకారులకు పుట్టిల్లు అయిన రాజమండ్రిని కళాపరంగా తెలుగుదేశంప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నంది నాటక బహుమతీ ప్రదానోత్సవం రంగరంగ వైభవంగా శనివారం రాత్రి రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో జరిగింది. ఏపీ చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుక ముగింపు అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ 15 రోజులుగా నందినాటకోత్సవాలను కన్నులపండుగగా నిర్వహించారని అభినందించారు. రాజమండ్రిని బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికతో ముందుకు వెళతామని చెప్పారు.
ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలకు రూ.1400 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గత పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహించామని, ఇప్పుడు అంతకు రెట్టింపు స్థాయిలో నిర్వహిస్తామన్నారు. ధవళేశ్వరంలో రూ.10 కోట్లతో కాటన్ మ్యూజియంను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాజమండ్రి, కోనసీమ ప్రాంతాలతో పాటు పాపికొండలు టూరిజానికి అనువైన ప్రాంతాలుగా ఉన్నాయన్నారు. తొలుత చంద్రబాబు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ వెబ్సైట్, నందినాటకోత్సవాల సావనీర్‌ను సీఎం ఆవిష్కరించారు. 2013 సంవత్సరానికి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాన్ని జిల్లాకు చెందిన ప్రముఖనటుడు, అభినవ ఆంజనేయ బిరుదాంకితుడు పేపకాయల లక్ష్మణరావుకు అందజేశారు.
నందినాటకోత్సవాల్లో పాల్గొని వడదెబ్బతో మృతి చెందిన నటి వాణీబాల తల్లి బడుగు సీతమ్మకు నిర్వాహకులు సమకూర్చిన రూ.లక్షను అందచేశారు. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ విభజన అనంతరం తొలిసారి నందినాటకోత్సవాలు రాజమండ్రిలో నిర్వహించడం ఈ ప్రాంతానికి ఇచ్చిన గౌరవమన్నారు. అద్భుతంగా జరిగిన నాటకాలకు జనం కూడా అత్యధిక సంఖ్యలో హాజరై నాటకరంగానికి ఊపిరి పోశారన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎప్పుడో బ్రిటిష్ వారు పెట్టిన రాజమండ్రి అనే పేరును రాజమహేంద్రవరంగా మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి మేయర్ పంతం రజనీశేషసాయి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణలు మాట్లాడారు. ఎఫ్డీసీ ఎండీ రమణారెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో నంది నాటకోత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
ఆనం కళాకేంద్రం ఆధునికీకరణకు సహకరించిన రిలయన్స్, ఓఎన్జీసీ, గెయిల్, ఆనం ఎలక్ట్రికల్స్, రాజమండ్రి నగరపాలక సంస్థకు చెందిన ప్రతినిధులకు, నంది నాటకోత్సవాలు నిర్వహించిన కమిటీ సభ్యులను సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల, దేవినేని ఉమ, నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, పి.పుల్లారావు, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఆప్కాబ్ వైస్ చైర్మన్ వరుపుల రాజా, ప్రముఖ హాస్యనటుడు ఆలీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
తొలుత వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన సినీ పాటలు కళాకారులతో పాటు జనాన్ని ఉర్రూతలూగించాయి. ఇదిలా ఉండగా నాటకోత్సవాలకు వచ్చిన బాలనటి లక్కీ లక్ష్మి తల్లి భవానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హుటాహుటిన అంబులెన్స్‌లో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.