laxminarasimha swami temple
-
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న శారదాపీఠం ఉత్తరాధికారి
సాక్షి, కాకినాడ: విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన లక్ష్మీనరసింహస్వామి రథాన్ని పరిశీలించిన స్వామీజీ.. రథం అత్యంత సుందరంగా ఉందని, 90 రోజుల్లో 40 అడుగుల రథాన్ని నిర్మించడం అభినందనీయమని ప్రశంశించారు. స్వామివారి ఉత్సవాలకు ముందే రథాన్ని నిర్మించడం ఆనందదాయకమని స్వామీజీ పేర్కొన్నారు. రథం యొక్క సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగమానుసారం శాస్త్రబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ఆలయ అభివృద్ధిపై అధికారులు, పండితులకు స్వామీజీ పలు సూచనలు చేశారు. ఆలయాల్లో రథాలు భగవంతుని శరీరంలో భాగమని పేర్కొన్న స్వామీజీ.. దైవ సంపద పరిరక్షణ దేవాదాయశాఖతో పాటు ప్రతిఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. -
బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఓవరాక్షన్
అనంతపురం: బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి తెరతీశారు. రోడ్ల విస్తరణలో భాగంగా అనంతపురం జిల్లాలోని కదిరి లక్షీనరసింహస్వామి ఆలయ బలిపీఠాన్ని తొలగిస్తున్నారంటూ తప్పుడు ట్వీట్ చేశారు. విష్ణువర్ధన్‌రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాన్ని అనంతపురం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ డా.సిరి ఖండించారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్షీనరసింహస్వామి ఆలయ బలిపీఠాన్ని తొలగించే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచన తమకు లేదని ఆమె స్పష్టం చేశారు. బలిపీఠంపై బీజేపీ నేత చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆమె ఆధారాలతో సహా బయటపెట్టారు. మరోసారి తప్పుడు వార్తలు ప్రచారం చేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని సిరి హెచ్చరించారు. తప్పుడు వార్తల ప్రచారం విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారు ఎంతటివారైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. దేవాలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు గత కొంతకాలంగా ఆలయాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కేసులు కూడా నమోదు చేసి, దాడులకు పాల్పడిన టీడీపీ, బీజేపీ నేతలను అరెస్టు చేశామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇదివరకే ప్రకటించారు. (చదవండి: ఆలయ ఘటనల్లో తెలుగుదేశం కుట్ర) -
ఇది నర్సన్న పూలగుట్ట!
కృష్ణశిలల సౌందర్యం.. ఫలపుష్పాల సోయగం.. మధ్యలో కొంగుబంగారమై విలసిల్లే యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహ క్షేత్రం. యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభ సుగంధ పరిమళాలను అద్దుకుంటోంది. అందంగా అల్లుకున్న లతలు.. మదిదోచే పూదోటలు.. నేలపై హరివిల్లు విరిసినట్టు.. కనుచూపు మేర పచ్చదనం తివాచీలా పరుచుకుని వెల్లి‘విరి’స్తోంది. రూ.5 కోట్లతో చేపట్టిన మొక్కల పెంపకంతో యాదాద్రి పూలగుట్టను తలపిస్తోంది. వందకుపైగా ఫల, పుష్ప, ఔషధ, సుగంధ మొక్కలు, నీడనిచ్చే మహావృక్షాలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. వీటిని థాయ్‌లాండ్, బెంగళూరు, ఏపీలోని కడియంతో పాటు ప్రసిద్ధిచెందిన నర్సరీల నుంచి తెప్పించారు. ఇప్పటివరకు 90 శాతం మొక్కలు నాటడం పూర్తయ్యింది. 2021 జనవరి చివరి నాటికి పచ్చదనాన్ని సిద్ధం చేయాలనే సీఎం కేసీఆర్ ఆదేశాలతో పనుల్ని ముమ్మరం చేశారు. – సాక్షి, యాదాద్రి రాయగిరి నుంచి యాదాద్రికి వెళ్లేదారిలో రోడ్డుకు ఇరువైపులా, మధ్యలో పచ్చని చెట్లు, పూల మొక్కలు ‘యాదాద్రి’కి పసిడి శోభ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయంలోని క్యూలైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ క్యూలైన్లను ప్రత్యేక టెక్నీషియన్లు బంగారు వర్ణంతో తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన ఆలయ ముఖద్వారం నుంచి స్వామిని దర్శించుకుని వెళ్లే వరకు పసిడి వర్ణంలో ఉండే ఈ క్యూలైన్లు ఆలయానికి మరింత శోభను తేనున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, యాదాద్రి భువనగిరి -
యాదాద్రి : కేసీఆర్ బొమ్మపై వెనక్కు తగ్గిన ప్రభుత్వం
సాక్షి, యాదగిరిగుట్ట: ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో గత రెండు రోజులుగా ఉత్కంఠత నెలకొంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా రూపుదిద్దుకుంటున్న అష్టభుజి ప్రాకార మండపం స్తంభాలపై కేసీఆర్, హరితహారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, కారుగుర్తు మొదలైనవి చెక్కడంతో తీవ్ర దుమారం రేగింది. దేవాలయంలో వ్యక్తులు, పార్టీ గుర్తులు పెట్టడంమేంటని విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు యాదాద్రిలో ఆందోళన చేపట్టారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక భారీ ఎత్తున విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. వివాదాలకు కారణమైన కేసీఆర్ బొమ్మ సహా అన్ని బొమ్మలు తొలగిస్తామని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు శనివారం సాయంత్రం వెల్లడించారు. ఇక భారీ పోలీస్ బందోబస్తు నడుమ బొమ్మల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. యాద్రాద్రి కొండపైకి మీడియాను అనుమతించలేదు. (చదవండి : మండపాల్లో కేసీఆర్ బొమ్మ చెక్కడంపై నిరసన) -
వైభవంగా చక్రతీర్థం,మహాపూర్ణాహుతి
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులతోపాటు శ్రీచక్ర పెరుమాళ్లను అలంకారం చేసి ప్రత్యేక సేవలో పూజలు చేశారు. అదే విధంగా శ్రీ చక్ర పెరుమాళ్లకు చక్రతీర్థ స్నానం ఆచరింపజేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన ముక్కోటి దేవతలను ఆయా స్వస్థలాలకు పంపించే దేవతా ఉద్వాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు నల్లంథీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
వాన నీటిలో నారసింహుడు
యాదగిరికొండ(ఆలేరు) : రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ప్రధానాలయంలోని స్వయంభు గర్భాలయం ముం దున్న ముఖమండపం బుధవారం రాత్రి కురిసిన వాననీటితో పూర్తిగా నిండిపోయింది. స్వయంభుమూర్తుల వద్దకు సైతం నీళ్లు వెళ్లాయని పనిచేసే కూలీలు పేర్కొన్నారు. ఇది చాలా అపచారమని, మనం కాళ్లతో తొక్కిన నీరు స్వామి వారిని తాకితే మంచిది కాదని కొందరు అర్చకులు తెలిపారు. ఆ నీటిలోనే నిలబడి ఆరగింపు, ఆరాధన, అభిషేకం కానిస్తున్నారు. కనీసం ఆలయ అర్చకులైనా ఈ విధానం సరైంది కాదని అధికారులకు చెప్పడం లేదు. స్వయంభుమూర్తుల వద్ద నీటిలోనే నిత్యకైంకర్యాలు మమ అనిపిస్తున్నారు. నిర్మాణానికి ముందే ఈ విధంగా వాన నీరు వస్తే ఏ చర్యలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతానికి మోటార్లతో నీటిని తోడేస్తున్నారు. ప్రతి నిర్మాణానికి డ్రెయినేజీ ముఖ్యమైంది. కానీ ఇంత పెద్ద నిర్మాణం చేపట్టిన అధికారులు వర్షపు నీరు వెళ్లే మార్గం ఆలోచించలేక పోయారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆర్కిటెక్టు ఆనందసాయి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావులు మట్లాడుతూ కొండపూర్తిగా రాయితో నిండి ఉంద,ని రాయిని పగలకొట్టడం జరగలేదని తెలిపారు. కానీ భవిష్యత్‌లో డ్రెయినేజీ బయటకు కనిపించకుండా చేసి ఎవరూ ఊహించని రీతిలో నిర్మించనున్నట్టు చెప్పారు. -
‘హరిద్ర’..ఇక సర్వాంగ సుందరం
వర్గల్(గజ్వేల్) : సహజసిద్ధ కొండ గుహల్లో స్వయంభువుగా శ్రీలక్ష్మీ నారసింహుడు వెలసిన భవ్య క్షేత్రం..తూర్పు దిశలో స్వామి వారి పాదాలు తాకుతూ అర్ధ చంద్రాకృతిలో ఉత్తరం మీదుగా పడమర వైపు పరవళ్లు తొక్కుతూ సాగిపోయే పవిత్ర హరిద్రా నది ప్రవాహం..వెరసి రెండో యాదాద్రిగా భక్తజనాదరణ చూరగొంటున్న వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రం. అయితే, ఒకప్పుడు గలగల పారిన హరిద్ర నేడు.. వానలు కరువై, బావులు అంతర్ధానమై, గొట్టపు బావులు వట్టిపోతున్న వేళ.. ఉనికి కోల్పోయే దుస్థితి దాపురించింది. నాచగిరికి కంఠహారం కావాల్సిన ఈ నది మురుగుకూపంగా మారింది. తాజాగా, సీఎం కేసీఆర్ హామీతో ‘హరిద్రా’ నదికి మోక్షం లభించింది. నిరంతర జలకళ, సుందరీకరణతో అలరారనున్నది. ఇందులో భాగంగా ఆదివారం సర్వే పనులు మొదలయ్యాయి. 800 మీటర్ల పొడవునా ‘హరిద్ర’ తీరం నాచారం గుట్ట శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రం మీదుగా 800 మీటర్ల పొడవునా హరిద్రానది ప్రవహిస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కడాలేని విధంగా ఈ ప్రవాహం క్షేత్రం చుట్టూరా అర్ధచంద్రాకృతిలో తాకుతూ తూర్పు దిశ నుంచి ప్రారంభమై ఉత్తరం మీదుగా పడమటి వైపు సాగిపోతుంది. ఈశాన్యంలో జలకళ ఉండడం ప్రాశస్త్యంగా భావిస్తారు. çహరిద్రానది ప్రవహించే మార్గాన్ని పసుపులేరుగా, హల్దీవాగుగా ఈ ప్రాంత ప్రజలు పిలుస్తుంటారు. నాచారం వద్ద ఎగువ భాగంలో గతంలో వాగుకు అడ్డంగా ఆనకట్ట నిర్మించారు. వాగు పొంగి పొరలితేనే దిగువకు నీళ్లు అనే పరిస్థితి.. దీంతో ఆలయం ముందు నుంచి ప్రవహించాల్సిన వాగులో నీటి నిల్వలు కరువై పిచ్చిమొక్కలకు ఆలవాలమైంది. దుర్ఘంధం పంచే మురుగు కూపంగా మారింది. సీఎం కేసీఆర్ హామీతో మోక్షం.. ఈ నెల 17న తూప్రాన్ నుంచి గజ్వేల్ వైపు వెళుతున్న సీఎం కేసీఆర్ ఆలయ ఛైర్మన్, స్థానికుల అభ్యర్థన మేరకు నాచారం గుట్ట బ్రిడ్జివద్ద రెండు నిమిషాలు ఆగారు. నాచగిరి క్షేత్రానికి వన్నెలద్దేలా ‘హరిద్ర’ సుందరీకరించాలని, యేడాది పొడవునా నీరుండేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. దీంతో భక్తజనులకు నదీ స్నానం చేసే అవకాశం చేరువకానున్నది. సర్వాంగ సుందరంగా హరిద్రను తీర్చిదిద్దే పనులకు తొలి అడుగుపడింది. ఇరిగేషన్ బృందం సర్వే ప్రారంభం రిటైర్డ్ ఎస్ఈ, ఉమ్మడి జిల్లా నీటిపారుదల విభాగం ప్రభుత్వ సలహాదారు మల్లయ్య నేతృత్వంలో మండల ఇరిగేషన్ ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి, టోటల్ స్టేషన్ ఆపరేటర్, మరో ముగ్గురు సహాయకులతో కూడిన బృందం నాచగిరి వద్ద హరిద్రా (హల్దీ వాగు) సర్వేకు ఆదివారం శ్రీకారం చుట్టింది. వాగు లోతు, వెడల్పు, కాంటూరు లెవెల్స్‌తో డిజిటల్ విధానంలో, ఆధునిక యంత్రాలతో కొలతల సేకరణలో బృందం నిమగ్నమైంది. ఎక్కడెక్కడ చెక్‌డ్యామ్‌లు నిర్మించాలి, నీటి నిల్వ సామర్థ్యం, గోడల నిర్మాణం పరిగణలోకి తీసుకుని సర్వే చేపట్టారు. మంగళవారంలోగా అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తారు. రెండో దశలో సుందరీకరణ కోసం సర్వే ఇరిగేషన్ బృందం హరిద్ర ప్రక్షాళన, నీటి నిల్వ లకు సర్వే ముగిసిన తరువాత రెండో దశలో హరిద్ర సుందరీకరణకు టూరిజం శాఖ రంగంలోకి దిగనుంది. మాస్టర్‌ప్లాన్‌లో అంతర్భాగమై న హరిద్రా నది సుందరీకరణకు వీలుగా పర్యాటక ఆదరణ చూరగొనేలా ల్యాండ్ స్కేపింగ్, చిన్న గార్డెన్, గ్రీనరీ, లైట్లు, పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా, దేవతార్చనకు వీలుగా ప్రత్యేకంగా పూలతోట, పెడల్ బోట్లు, ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా దేవతా విగ్రహాల ప్రతిమలు, హరిద్రా అందాలను ఇనుమడింపజేయనున్నాయి. పుణ్యక్షేత్రం వద్ద నదీ సౌకర్యం సీఎం కేసీఆర్ నాచగిరి క్షేత్రం వద్ద ‘హరిద్ర’ నది యేడాది పొడవునా జీవకళ ఉట్టిపడేలా జలకళతో తీర్చిదిద్దనున్న నేపథ్యంలో సందర్శనకు వచ్చే భక్తులకు నదీ సౌకర్యం చేరువకానున్నది. మూడు చెక్‌డ్యామ్‌లు, మూడు స్నానపు ఘాట్లు, పురుషులకు, మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు వేర్వేరు గదులు, ఇతర సౌకర్యాలు డ్యామ్‌ల వద్దనే కల్పించనున్నాం. మిషన్ కాకతీయ ద్వారా జూన్‌లోగా హరిద్రపై డ్యామ్‌ల నిర్మాణం, సుందరీకరణ పూర్తి చేయాలన్నదే మా సంకల్పం. ఇందుకోసం సర్వేకు శ్రీకారం చుట్టాం. జూన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కొండపోచమ్మ ద్వారా ఇతర చెరువులు, వాగులతోపాటు, నాచగిరి హరిద్ర నదిని అనుసంధానం చేస్తాం. – గడా అధికారి హన్మంతరావు -
యాదగిరీశునికి సువర్ణ పుష్పార్చన
తెలంగాణ తిరుపతిగా రూపుదిద్దుకోనున్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం స్వామి, అమ్మవార్లకు సువర్ణ పుష్పార్చన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాలు, పంచోపనిషత్తులు, పంచసూక్తాలతో అభిషేకించి పట్టువస్త్రాలను ధరింపచేశారు. వివిధ రకాలైన పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి 108 బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన చేశారు.