ఏం చేద్దాం
కల్వర్టు, రోడ్డు పనులకు 15 శాతం
తక్కువతో నెల్లూరు కాంట్రాక్టర్ టెండర్
8 పనులు తనకే దక్కాలని ముందే హుకుం జారీ చేసిన వెంకటగిరి టీడీపీ ముఖ్య నేత
8 కాంట్రాక్టర్‌ను ఎలా తప్పించాలో తెలియక తలపట్టుకున్న తెలుగుగంగ అధికారులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి తక్కువ ధరకు టెండర్లు దాఖలైతే ప్రభుత్వానికి డబ్బు ఆదా అయిందని అధికారులు సంతోషించాలి. కానీ తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులు మాత్రం 15 శాతం తక్కువతో దాఖలైన టెండర్ చూసి వణికిపోతున్నారు. తక్కువ ధరకు టెండర్ దాఖలు చేసిన కాంట్రాక్టర్‌ను ఎలాగైనా తప్పించకపోతే తమకు తలనొప్పులు తప్పవని అదిరిపోతున్నారు. ఈ పనులు తనకే దక్కాలని ఇంతకుముందే వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు హుకుం జారీ చేయడమే ఇందుకు కారణం.తెలుగుగంగ ప్రాజెక్టు పరి«ధిలోని అంతర్గత రోడ్లు, పైప్లైన్ల పై కల్వర్టు, గుండవోలు వద్ద రోడ్డు నిర్మాణం కోసం రూ.1, 38,75,748తో ఈ నెల 11వ తేదీ తెలుగుగంగ ఎస్ఈ ఆన్లైన్లో టెండరు పిలిచారు. ఈ నెల 25వ తేదీతో టెండర్ల దాఖలు కు గడువు ముగిసింది. తన నియోజకవర్గంలోని ఏ పనికీ ఏ కాంట్రాక్టరు అడ్డు రాకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నా యకుడు తెలుగుగంగ ఇంజినీరింగ్ అధికారులకు హుకుం జారీ చేశారు. మీరు చస్తారో, బతుకుతారో, కాంట్రాక్టర్లను బతిమాలుతారో, బెదిరిస్తారో నాకు తెలి యదు. పనులు మాత్రం మాకే వచ్చేలా చేయాలని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రూ.2.60 కోట్ల పనులను ఈనెల 22వ తేదీ సరైన కారణం చూపకుండానే టెండర్ నోటిఫికేషన్‌నే రద్దు చేశారు. నిధులు లేనందువల్ల టెండరు నో టిఫికేషన్ రద్దు చేశామని చెబుతున్న అధికారులు నిధులు లేనప్పుడు టెండర్లు ఎందుకు పిలిచారనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమలుతున్నారు. ఈ నేపథ్యంలోనే రూ.1.30 కోట్లతో అంతర్గత రోడ్డు, కల్వర్టు, పైప్‌లైన్ నిర్మాణం కోసం పిలిచిన టెండర్లలో వెంకటగిరి టీడీపీ ముఖ్య నాయకుడికి ఎవరూ పోటీ రాకుండా అధికారులే మాట్లాడి సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. మంగళవారం ఉదయం ఆన్లైన్లో ఈ టెండర్లను తెరిచిన అధికారులకు చెమటలు పట్టాయి. వెంకటగిరిలో అంతా ఆయన చెప్పినట్లే జరగాలనే సమాచారం అందని ఒక కాంట్రాక్టర్ ఏకంగా 15 శాతం తక్కువతో టెండరు దాఖలు చేశారు. అతను కూడా నెల్లూరు టీడీపీ ముఖ్య నాయకుడికి బాగా కావాల్సిన వ్యక్తి కావడంతో అధికారులు చెప్పినా వెనక్కు తగ్గడానికి ససేమిరా అంటున్నారు. దీంతో ఏం చేయాలో అధికారుల్లో ఆందోళన మొదలైంది. వెంకటగిరి నాయకుడు తమ ను ఏమంటారోనని వారు భయపడుతున్నారు. ఇదే పనికి 4.5 శాతం ఎక్కువతో టెండర్ దాఖలు చేసిన వ్యక్తికి ఎలాగైనా ఈ పని అప్పగించాలని తెలుగుగంగ అధికారుల మీద తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఏ కారణం లేకుండా ఇప్పటికే రూ.2.6 కోట్ల పనులకు సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేశామని, ఈ నోటిఫికేషన్ కూ డా రద్దు చేస్తే సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తుతాయని, కాంట్రాక్టర్లు ఎవరైనా కోర్టుకు వెళితే తాము ఇబ్బంది పడతామని వారు ఆందోళన చెందుతున్నారు.